- Home
- Andhra Pradesh
- Bats Village : తలకిందులుగా వేలాడే గబ్బిలాలను పూజించే వింత గ్రామం.. ఎక్కడుందో తెలుసా?
Bats Village : తలకిందులుగా వేలాడే గబ్బిలాలను పూజించే వింత గ్రామం.. ఎక్కడుందో తెలుసా?
చెట్లు, జంతువులను పూజించడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమే. అయితే కొన్నిచోట్ల మరీ విచిత్రమైన ఆచారాలు ఉంటాయి.. అలాంటిదే ఏపీలోని గోనుపల్లి గ్రామం. ఇక్కడ తలకిందులుగా వేలాడే గబ్బిలాలను పూజించే ఆచారం ఉంది.

గబ్బిలాలను పూజించే గ్రామం...
సాధారణంగా గబ్బిలాలు కనిపిస్తే చాలామంది భయపడతారు. కొందరు వాటిని అపశకునంగా భావిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ గబ్బిలాలను సాధారణ జీవులుగా కాకుండా గ్రామాన్ని కాపాడే దైవస్వరూపాలుగా చూస్తారు. వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ నమ్మకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? గబ్బిలాలను అక్కడి ప్రజలు ఎందుకు పూజిస్తారు? ఆ విశేషాలు తెలుసుకుందాం.
గబ్బిలాలను దేవతలుగా భావించే గ్రామం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గబ్బిలాలను పూజించే గ్రామం ఉంది. గోనుపల్లి గ్రామం గబ్బిలాల సంరక్షణకు, వాటిపై స్థానికులు చూపించే గౌరవానికి ప్రత్యేకంగా నిలుస్తోంది. రాపూరు మండల పరిధిలోని ఈ గ్రామంలో గబ్బిలాలు నివసించే ప్రాంతాన్ని స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే గబ్బిలాలు దేవుళ్లుగా, వాటి నివాాన్ని దేవాలయంగా భావిస్తారన్నమాట.
చాలా ప్రాంతాల్లో గబ్బిలాలను చూసి భయపడటం లేదా వాటిని తరిమేయడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. అయితే గోనుపల్లిలో మాత్రం వాటి నివాసానికి ఆటంకం కలిగించకుండా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ జీవులు తమ గ్రామానికి మేలు చేస్తాయని, వాటి ఉనికి శుభప్రదమని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
200 ఏళ్లుగా కొనసాగుతున్న నమ్మకం!
గోనుపల్లిలో గబ్బిలాలు సుమారు 200 ఏళ్లుగా నివసిస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు. ఇన్ని తరాలుగా అవి గ్రామంలోనే ఉండటంతో వాటితో గ్రామస్తులకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలుస్తోంది. ఇలా గ్రామస్తులకు, గబ్బిలాలకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది... అందుకే మనుషులను చూసి అవి భయపడవు, గబ్బిలాలను చూసి మనుషులు భయపడరు. కాలక్రమేణా ఆ అనుబంధం ఆరాధనగా మారింది.
తమ గ్రామాన్ని గబ్బిలాలు కాపాడుతాయని, వాటి వల్ల తమకు ఎలాంటి ఆపదలు రావని గ్రామస్థులు నమ్ముతారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి గబ్బిలాల వల్లే వ్యాపించిందని అంటారు... కానీ ఈ గోనుపల్లి గ్రామస్తుల మాత్రం ఈ మహమ్మారి నుండి తమ గ్రామాన్ని కాపాడింది గబ్బిలాలే అంటారు.
గబ్బిలాలకు హాని చేయకుండా ఎందుకు కాపాడుతారు?
గోనుపల్లి గ్రామస్థులు గబ్బిలాలు నివసించే చెట్లను, వాటి ఆవాసాలను కాపాడుతుంటారు. ఎవరైనా గబ్బిలాలను తరమడానికి ప్రయత్నించినా, దాడి చేస్తున్నా అడ్డుకుంటారు... వీటి సంరక్షణ కోసం ఎంతకైనా సిద్దమంటారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గబ్బిలాలు కేవలం స్థానిక విశ్వాసాలకు సంబంధించిన జీవులు మాత్రమే కాదు. పర్యావరణంలోనూ వీటికి ప్రత్యేక పాత్ర ఉంది. కొన్ని జాతుల గబ్బిలాలు పండ్లను తింటూ విత్తనాల వ్యాప్తికి తోడ్పడతాయి. మరికొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుని వాటి సంఖ్యను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల వాటి నివాస ప్రాంతాలను కాపాడటం ప్రకృతి సమతుల్యతకు కూడా ఉపయోగకరమే.
గబ్బిలాలు నిజంగా ప్రమాదకరమా?
గబ్బిలాలన్నీ ప్రమాదకరమైనవని అనుకోవడం సరికాదు. అయితే ఇతర వన్యజీవుల మాదిరిగానే వాటితోనూ జాగ్రత్తగా ఉండాలి. వాటిని చేతులతో పట్టుకోవడం, గాయపడిన గబ్బిలాలను నేరుగా తాకడం లేదా వాటి నివాస ప్రాంతాల్లో అనవసరంగా కలవరపెట్టడం చేయకూడదు. కాటు లేదా గీత పడితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
గబ్బిలాలను గౌరవించడం అంటే వాటిని చేతులతో తాకడం లేదా దగ్గరకు వెళ్లడం కాదు. వాటి సహజ ఆవాసాలను కాపాడుతూ, వాటికి ఇబ్బంది కలగకుండా ఉండటమే సరైన మార్గం.
ప్రకృతి, సంప్రదాయం కలిసిన ప్రత్యేక గ్రామం
జంతువులు, పక్షులు, చెట్లను పవిత్రంగా భావించే సంప్రదాయాలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. కొన్ని గ్రామాల్లో చెట్లను గ్రామ దేవతలతో అనుసంధానిస్తే, మరికొన్ని చోట్ల ప్రత్యేక జంతువులకు దైవత్వాన్ని ఆపాదిస్తారు. గోనుపల్లిలో గబ్బిలాల పట్ల కనిపించే గౌరవం కూడా అలాంటి స్థానిక విశ్వాసాల్లో ఒకటి.
గబ్బిలాలను పూజించడం వెనుక ఉన్న నమ్మకాలు శాస్త్రీయంగా నిర్ధారించబడనప్పటికీ, వాటికి హాని చేయకుండా సంరక్షించాలనే ఆలోచన మాత్రం ప్రాధాన్యమైనది. మనుషులతో పాటు ఇతర జీవులకూ ప్రకృతిలో జీవించే హక్కు ఉందనే విషయాన్ని ఈ గ్రామం గుర్తుచేస్తోంది.

