- Home
- Andhra Pradesh
- డెన్మార్క్ టెక్నాలజీతో ఏపీలో రోడ్లు... ఏమిటీ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేంటి?
డెన్మార్క్ టెక్నాలజీతో ఏపీలో రోడ్లు... ఏమిటీ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం ప్రారంభమయ్యింది. అసలు ఏమిటీ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేేశ్ రోడ్ల నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ
Nara Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే టక్కున గుర్తుకువచ్చేది టెక్నాలజీ. ఆయన వయసుకు, ఆలోచనా విధానానికి ఏమాత్రం పొంతన ఉండదు... నవ యువకుడి మాదిరిగా ఎప్పుడూ టెక్నాలజీ వెంటపడుతుంటారు. ఎక్కడ ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటే వెంటనే తీసుకువస్తారు... అందువల్లే చంద్రబాబు హైటెక్ సీఎంగా గుర్తింపు పొందారు.
అయితే తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా పాడయిపోయిన రోడ్లన్నింటిని మరమ్మతులు చేయించింది. అలాగే చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేసింది. అయితే తాజాగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్లు మళ్లీ పాడయిపోతున్నాయి. దీంతో ఇక ఇలాకాదు... సాంప్రదాయ పద్దతిలో రోడ్లు వేయడం కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఎక్కువకాలం మన్నికగల రోడ్లను వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే సరికొత్తగా డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఏమిటీ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ
రోడ్లతో పాటు ఇతర నిర్మాణాలను మరింత నాణ్యతతో నిర్మించి ఎక్కువకాలం మన్నిక ఉండేందుకు డెన్మార్ కనుగొన్న సరికొత్త పద్దతే ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ. ఇందులో తారు మిశ్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి అరామిడ్, పాలియోలిఫిన్ పైబర్ వంటివి ఉపయోగిస్తారు. దీనివల్ల రోడ్లు పగుళ్ళు రాకుండా, వర్షపునీటి కారణంగా గుంతలు పడకుండా ఉంటాయి.
ఇప్పటికే ఈ టెక్నాలజీని యూకేలోని హిత్రో ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో వాడారు. అలాగే దుబాయ్ మెట్రో, జర్మని A7 మోటార్ వే వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ టెక్నాలజీని ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.
డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ ఉపయోగాలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ తారు ప్లాంటును పరిశీలించారు. ఈ టెక్నాలజీతో రోడ్డు వేయడంద్వారా ఉపయోగాలేమిటో ప్రభుత్వం వివరిస్తోంది.
1. ఈ డెన్మార్క్ టెక్నాలజీని ఉపయోగించి రోడ్లు వేయడంద్వారా నాణ్యత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మనదేశంలో వేసే తారురోడ్ల జీవిత కాల పరిమితి 3 ఏళ్లు మాత్రమే... కానీ ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు వేస్తే జీవితకాలం 10 ఏళ్లకు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
2. ఈ టెక్నాలజీలో తారు చాలా బలంగా అతుక్కుపోతుంది... కాబట్టి రోడ్లు పగుళ్లు రాకుండా ఉంటాయి. దీనివల్ల రోడ్డు పాడయ్యే అవకాశాలు తగ్గుతాయి.
ఈ రోడ్లను భారీ వర్షాలు, హెవీ లోడ్స్ కూడా ఏం చేయలేవట..
3. వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా వరద పరిస్ధితులు తలెత్తి రోడ్లు వాగులుగా మారిపోతాయి. ఈ నీటి ప్రవాహంవల్ల రోడ్ల కోతకు గురయి పాడయిపోతాయి. కానీ ఈ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ నీటి ప్రవాహాలను కూడా తట్టుకుంటుందని చెబుతున్నారు.
4. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు బాగుండాలి. అప్పుడే పరిశ్రమలకు సంబంధించిన హెవీ లోడ్స్ ట్రాన్స్ పోర్ట్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఈ హెవీ లోడ్స్ వల్ల రోడ్లు తొందరగా పాడయిపోతాయి. కానీ డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో వేసే రోడ్లు హెవీ లోడ్ ని కూడా తట్టుకుంటాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
5. ఎంత కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా డెన్మార్ టెక్నాలజీతో వేసిన రోడ్లు ఉంటాయట. అంటే వేడి, చలి వాతావరణాన్ని కూడా ఈ రోడ్లు తట్టుకుంటాయని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.
డెన్మార్క్ టెక్నాలజీతో కర్నూల్ రోడ్డు
డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీ ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పరిశీలించాలని చూస్తోంది. అందుకే పైలట్ ప్రాజెక్టుగా కర్నూల్ జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఓ రోడ్డును ఈ టెక్నాలజీతో వేస్తున్నారు. స్వయంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి ఇలా కొత్త టెక్నాలజీతో వేస్తున్న రోడ్డు పనులను ప్రారంభించారు.
Happy to launch the first-of-its-kind road project in Sanjamala mandal, Banaganapalle constituency, using Danish Fiber Technology! This innovative approach, combining Bitumen with Aramid and Polyolefin fibers, promises roads that are 50% more durable and resistant to potholes and… pic.twitter.com/kW4gFIEc6r
— BC Janardhan Reddy Official (@bcjrofficial) July 4, 2025
డెన్మార్క్ నిధులతోనే ఏపీ రోడ్డు
సంజామల మండలకేంద్రం సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల్లో ఓ కిలోమీటర్ వరకు ఈ డానిష్ టెక్నాజీని ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆ టెక్నాలజీతో రోడ్లు వేస్తామని వెల్లడించారు. అయితే డెన్మార్క్ కు చెందిన నిపుణుల బృందం ఆ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుందని... ఇందుకయ్యే రూ.32 లక్షల ఖర్చును కూడా వారే భరిస్తున్నారని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.