జాతకాలు మార్చేవాడిని: బాలకృష్ణకు కొడాలి నాని వార్నింగ్
ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతలకు, ఏపీ మంత్రి కొడాలి నానికి మధ్య మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ నేతలతో పాటు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. తనపై బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రి ఘాటుగా రిప్లై ఇచ్చారు.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానిపై బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలినాని కౌంటరిచ్చారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు.
నోరు అదుపులో పెట్టుకో... మా సహనాన్ని పరీక్షించొద్దంటూ మంత్రికి బాలయ్య వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మంత్రి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
తానేమీ ఆయన పక్కన జాతకాలు చెప్పుకొంటూ ఉండే సత్యనారాయణ చౌదరిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్నది జాతకాలు మార్చే కొడాలి నాని అంటూ ఆయన బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు.
తన బావను, అల్లుడిని తిడుతుంటే ఆయన చూస్తూ ఉంటాడని తాను అనుకోనని అనుకోవడం లేదన్నారు. కాకపోతే ఇవతల వైపు ఆయన పక్కన జాతకాలు చెప్పుకొంటూ ఉండే సత్యనారాయణ చౌదరి కాదని చెప్పారు.
ఇక్కడ జాతకాలు మార్చే కొడాలి నాని అని మంత్రి కొడాలి నాని బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ ను లక్ష్యంగా చేసుకొని మంత్రి కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. సహనాన్ని పరీక్షించొద్దన్నారు. తాము మాటల మనుషులం కాదన్నారు. సహనాన్ని పరీక్షించొద్దని ఆయన నానికి సూచించారు.
నోరు పారేసుకొంటే చూస్తూ ఉండమని తేల్చి చెప్పారు. అవసరమైతే చేతలు కూడా చేసి చూపిస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.
టీడీపీలో తాను దివంగత ఎన్టీఆర్ పై అభిమానంతో పనిచేశానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ కారణమన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతోనే ఆయన కొడుకు హరికృష్ణ వెంట ప్రయాణం చేశానని మంత్రి కొడాలి నాని గుర్తు చేసుకొన్నారు.
1999 లో హరికృష్ణ పార్టీ స్థాపించి పోటీ చేసిన సమయంలో హరికృష్ణకు తాను ఎన్నికల చీఫ్ ఏజెంట్ గా పనిచేసిన విషయాన్ని నాని గుర్తు చేసుకొన్నారు. రాజకీయాల్లో చోటు చేసుకొన్న మార్పుల కారణంగా హరికృష్ణ తనను టీడీపీలోకి పంపించారని.. ఆ తర్వాత ఆయన కూడ టీడీపీలో చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబునాయుడు ద్వేషిస్తారని మంత్రి నాని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వాడుకోవడం పార్టీ ఓటమి చెందినప్పుడు హరికృష్ణకు రాజ్యసభ సీటిచ్చి ఆ తర్వాత పక్కన పెట్టారని ఆయన విమర్శించారు
తనలో ఎన్టీఆర్, హరికృష్ణలు కన్పించేవారని అందుకే తనను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఈ కారణంగానే తాను చంద్రబాబు వద్ద నుండి బయటకు వచ్చినట్టుగా చెప్పారు.
వైఎస్ఆర్, ఆయన తనయుడు జగన్ లను చాలా దగ్గరి నుండి చూసినట్టుగా ఆయన తెలిపారు. వైఎస్ఆర్ గొప్ప నాయకత్వ లక్షణాలు కలవాడన్నారు. జగన్ దేవుడిని నమ్మే వ్యక్తిగా నాని చెప్పారు.
తాము ఏం చేసినా ప్రజలకు చెప్పాలనే దృక్ఫథం ఉన్న వ్యక్తి జగన్ అని మంత్రి కొడాలి నాని తెలిపారు.