పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు గేమ్ స్టార్ట్ ... ఈ సంకేతాలు అవేనా?
వపన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరందుకుంది. ఇందుకు బలం చేకూర్చేలా కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి... అవేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chandrababu Vs Pawan Kalyan
Chandrababu Vs Pawan Kalyan : 'హనీమూన్ టైం అయిపోయింది'... ప్రతిపక్ష వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వ పాలన గురించి చేస్తున్న కామెంట్ ఇది. కూటమి పార్టీల నాయకులు కూడా ఇదే భావనలో వున్నారు. తెలుగుదేశం, జనసేన,బిజెపి కూటమి అధికారంలోకి వచ్చి అర సంవత్సరం పూర్తయ్యింది... ఇన్నిరోజులు ప్రభుత్వం సెట్ కావడానికే టైం పట్టింది. అంటే ఇప్పటివరకు హనీ మూన్ సాగిందన్నమాట... ఇకపై అసలు పాలన వుంటుంది.
అయితే కేవలం ప్రభుత్వం విషయంలోనే కాదు రాజకీయాలు కూడా అంతే... ఇప్పటివరకు సాగిన రాజకీయాలు వేరు... ఇకపై జరగబొయే వేరు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి పాలనకే కాదు రాజకీయాలకు కూడా హనీమూన్ కాలం ముగిసిందన్నమాట. ఇంతకలం సాఫీగా సాగిన కూటమిలో ఇప్పుడు బీటలు వారుతున్నాయి.
టిడిపి, జనసేన, బిబెపి కూటమిలో చిన్న అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. ఇక విద్యా, ఐటీ వంటి కీలక శాఖల బాధ్యతలు వహిస్తూ నారా లోకేష్ కూడా మంత్రివర్గంలో వున్నారు. పాలనా నిర్ణయాల్లో చంద్రబాబు, పవన్ తర్వాత ఆయనదే కీలకపాత్ర.
ఇలా అంతా సాఫీగా సాగిపోతున్నవేళ లోకేష్ ను డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి వచ్చింది. టిడిపి నాయకులు లోకేష్ ను ఉపముఖ్యమంత్రి చేయాలని తమ నాయకుడు చంద్రబాబును కోరుతున్నారు. ఇది టిడిపి, జనసేన కేడర్ మధ్య నిప్పు రాజేసింది. భవిష్యత్ లో ఇది కార్చిచ్చుగా మారి కూటమిని విచ్చిన్నంచేసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అయితే చంద్రబాబే ఇదంతా కావాలనే చేయిస్తున్నాడనే మరో వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ నాయకుడిగా తన సత్తా ఏంటో గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు పవన్ కల్యాణ్. అధికారంలోకి వచ్చాక పాలనాపరంగా కూడా మంచిమార్కులు పడుతున్నాయి... తన శాఖల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇదే చంద్రబాబుకు మింగుడుపడటం లేదనేది వైసిపి నాయకుల వాదన.
పరిస్థితి ఇలాగే కొనసాగితే తన సీటుకే ఎసరు వస్తుందన్నది చంద్రబాబు భయపడుతున్నారని... అందువల్లే కొడుకును ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అందుకోసమే పవన్ కు సమానంగా తన కొడుకుకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకునే పనిలో పడ్డారని అంటున్నారు.
తన పార్టీ నాయకులతో చంద్రబాబే డిప్యూటీ సీఎంగా లోకేష్ నియమించాలనే డిమాండ్ చేయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటివారి అంటున్నారు. పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేసారనేది అంబటి వంటివారి మాటల్లో అంతరార్థం.
Chandrababu Vs Pawan Kalyan
లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు... అయితే ఇప్పుడు మరొకరిని కూడా ఉపముఖ్యమంత్రి నియమించాలనే డిమాండ్ టిడిపిలో మొదలయ్యింది. సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టిడిపి కేడర్ లోకేష్ ను మరింత ఉన్నత పదవిలో చూడాలని అనుకుంటున్నట్లు ... వారి అభీష్టం మెరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్నది ఆ నాయకుల డిమాండ్. ఈ మెరకు ఇప్పటికే పలువురు టిడిపి నేతలు బహిరంగంగానే లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటున్నారు.
ఉండి టిడిపి ఎమ్మెల్యే, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇలాంటి డిమాండే చేసారు. గతంలో ఏపీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వున్నారు... ఇప్పుడు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవికే ఓటేసారు.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా లోకేష్ కు మద్దతుగా గళం వినిపిస్తోంది.ఈ నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఇటీవల తన మనసులోని మాటను కార్యకర్తల పేరుతో బైటపెట్టారు. డిప్యూటీ సీఎంగా లోకేష్ ను చూడాలని తమ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
టిడిపి పార్టీ బలోపేతం కోసం లోకేష్ ఎంతగానో కష్టపడుతున్నారని...కోటి మందికి సభ్యత్వం కల్పించిన ఘనత ఆయనదని వర్మ కొనియాడారు. యువగళం ద్వారా ప్రజలకు దగ్గరైన లోకేష్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇలా కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఏ తప్పు లేదని వర్మ అన్నారు.
టిడిపి నాయకులు ఒకరితర్వాత ఒకరు లోకేష్ ను ఉపముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. దీనిపై టిడిపి అదిష్టానం అవునని కానీ, కాదని కానీ చెప్పడంలేదు. ఈ మౌనమే అర్ధాంగికారంగా అర్థమవుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనేది చంద్రబాబు కోరికేనని... దాన్ని తన పార్టీ నాయకుల ద్వారా బైటపెట్టిస్తున్నారని వైసిపి నాయకులు అంటున్నారు. ఇది నిజమైతే లోకేష్ డిప్యూటీ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు.
Chandrababu Vs Pawan Kalyan
లోకేష్ ను డిప్యూటీ సీఎం కాకుండా బిజెపి అడ్డుకుంటుందా?
తన తనయుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలన్న కోరికన సీఎం చంద్రబాబు ఎన్డిఏ పెద్దలకు తెలియజేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఏపీకి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారంట...అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడాన్ని అమిత్ షా అంగీకరించలేదు అని తమకు సమాచారం వుందని అంబటి అన్నారు.
ఇక లోకేష్ ప్రతి విషయంలోనూ తలదూరుస్తున్నాడని తన దృష్టికి వచ్చిందని... అదుపుచేయాలని చంద్రబాబుకు అమిత్ షా హెచ్చరించినట్లు అంబటి తెలిపారు. ఇలా ఎన్డిఏలో కీలక నాయకుడు లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రతిపాదనను అంగీకరించలేదని మాజీ మంత్రి అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీదుగానీ అంబటి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
నిజంగానే చంద్రబాబు ప్రతిపాదనను అమిత్ షా వ్యతిరేకిస్తే అది పవన్ కల్యాణ్ కోసమే అయివుంటుందనేది మరో వాదన. ఎందుకంటే పవన్ ను బిజెపి బాగా దగ్గరకు తీసుకుంటోంది... అతడు జనసేన పార్టీ నాయకుడైనా తమ పార్టీ నాయకుడిగానే చూస్తున్నారు బిజెెపి పెద్దలు.
ఇక ఎన్నికల సమయంలోనూ పవన్ ను సీఎం చేయాలని ప్రతిపాదనను కూటమి ముందు బిజెపి వుంచినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ ను స్వయంగా ప్రధాని మోదీ పొగిడిన సందర్భాలు వున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం ప్రతిపాదనను కూడా పవన్ కోసమే అమిత్ షా వ్యతిరేకించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.