- Home
- Andhra Pradesh
- Weather : రాబోయే రెండ్రోజులు ఏపీలో విచిత్ర వాతావరణం... అక్కడ వర్షాలు, ఇక్కడ వడగాలులు
Weather : రాబోయే రెండ్రోజులు ఏపీలో విచిత్ర వాతావరణం... అక్కడ వర్షాలు, ఇక్కడ వడగాలులు
ఆంధ్ర ప్రదేశ్ లో ఓవైపు ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు వాతావరణాన్ని చల్లబర్చి కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురుస్తాయన్న కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈసారి వర్షాలు ఎన్నిరోజులు కురవనున్నాయో తెలుసా?

Andhra Pradesh Weather
Weather : మండుటెండలతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలకు చల్లగాలులు ఊరటనిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి... దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. నడి వేసవిలో కురుస్తున్న ఈ వర్షాలు మరికొన్నిరోజులు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
మరో రెండ్రోజులు అంటే ఏప్రిల్ 10,11 (గురు, శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు. అయితే ఓవైపు వర్షాలు కొనసాగుతున్నా మరోవైపు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని హెచ్చరించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు లేకున్నా వేడిగాలులు వీస్తాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఈ ఎండా వాన పరిస్థితులు ఉండనున్నాయన్నమాట.
Andhra Pradesh Rains
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే రెండ్రోజులు విచిత్రమైన వాతావరణం ఉండనుందని వాతావరణ సూచనలను బట్టి అర్థమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు మొదలై వర్షం కురుస్తుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని... ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ రెండ్రోజులు రైతులు, రైతుకూలీలు వ్యవసాయ పనులేమీ పెట్టుకోవద్ద... పొలం పనులకు వెళ్లకపోవడమే మంచింది. పిడుగులతో కూడిన వర్షాలు లేదంటే వడగాలుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉండనుందని... అక్కడి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయి... కాబట్టి ఈ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana Rains
తెలంగాణలో వర్షాలు :
ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. గురు, శుక్రవారం రెండ్రోజులు భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో చిరుజల్లులు కురవనున్నాయని... కొన్నిచోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్ముకుని ఉండి వాతావరణం చల్లబడుతుంది... కానీ కొన్నిప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండ్రోజుల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి మళ్లీ ఎండలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.