ఏపీలో ట్రాఫిక్ రూల్స్ చేంజ్.. ఇక తప్పుచేస్తే చలానాలుండవు, మరి ఏం చేస్తారో తెలుసా?
Traffic Rules : ఆంధ్ర ప్రదేశ్ లో ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయరట… మరి ఏం చేయనున్నారో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త ట్రాఫిక్ నిబంధనలు
Andhra Pradesh Traffic Rules : ట్రాఫిక్ పోలీసులు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది చలానాలు. హెల్మెట్, సీటు బెల్టు అనేవి ముందుస్తు రక్షణలా కాకుండా ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకునే మార్గాల్లా చాలామంది భావిస్తారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారుల నుండి చలానాలు వసూలు చేయడంపై చూపించే శ్రద్ద వారి భద్రతపై అవగాహన కల్పించడంపై చూపించరు. హెల్మెట్ లేకున్నా, సీటుబెల్టు పెట్టుకోకున్నా చలానాలు వేసి వదిలేయడమే తమపనిగా భావిస్తారు. అయితే ఇకపై ఇలా కాదు... ఆంధ్ర ప్రదేశ్ లో ట్రాఫిక్ రూల్స్ పూర్తిగా మారిపోనున్నాయి. ముందుగా వాహనదారుల భద్రతకే ప్రాధాన్యత, ఆ తర్వాతే చలానాల వసూలు... ఇలా ట్రాఫిక్ నిబంధనల అమల్లో సరికొత్త మోడల్ ను అమలుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
చలానాలొద్దు... అవగాహనే ముద్దు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టిజిఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) పై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆయన ట్రాఫిక్ వ్యవస్థపై ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ఆదాయం కంటే రోడ్డు ప్రమాదాల నివారణపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చలానాలు వేసి వదిలిపెట్టడం కాదు దానివల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేయాలని... ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటే భారీగా జరిమానాలు విధించడమే సరైన మార్గం అన్న పోలీసుల సూచనలను సీఎం చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ట్రాఫిక్ పోలీసుల ఆలోచనాతీరు పూర్తిగా మారాలని... చలానాలు వేయడంద్వారా వాహనదారుల్లో మార్పు రాదన్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలానాలు వేస్తారన్న భయం కాదు తమ ప్రాణాలతో ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నామనే అవగాహన రావాలన్నారు. వాహనదారుల్లో ఇలాంటి మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చలానాలు వేయకుండా వారు ఏ తప్పు చేశారో తెలియజేస్తూ ఫోన్ కు మెసేజ్ పంపాలని ట్రాఫిక్ పోలీసులకు సీఎం సూచించారు. అవసరం అయితే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ఇలా మొదటిసారి ట్రాఫిక్ రూల్స్ పాటించనివారికి చేసిన తప్పేమిటో తెలియజేయాలి... మరోసారి అలాంటి తప్పు చేయకుండా మార్పు తీసుకురావాలి... అంతేగానీ చలానాలతో సరిపెట్టరాదని ఆదేశించారు. రెండోసారి కూడా అలాంటి తప్పులే చేస్తే అప్పుడు చలానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అంటేనే ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసి డబ్బులు వసూలుచేస్తారనే భావన ప్రజల్లో ఉంది... మన రక్షణ కోసమే నిబంధనలు పాటించాలని చెబుతారనే భావన లేదని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ పోలీసులపై ఉన్న ఈ భావన పోవాలన్నారు. అందుకే మొదట ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే తప్పు తెలియజేయాలి... చేసిన తప్పేమిటో తెలియజేసేలా ఫోన్లకు మెసేజ్ పంపించాలన్నారు. దీనివల్ల తప్పు చేస్తేనే చలానా వేస్తారనే భావన కలుగుతుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
కర్నూల్ ప్రమాదం, శ్రీకాకుళం తొక్కిసలాటపై సీఎం కామెంట్స్
ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఇలాంటివి జరగకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్మాణత్మక ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఎస్ఓపీలను సిద్దం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
రహదారులపై గుంతలు కన్పించకూడదు
రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇప్పటికీ రోడ్లు సరిగా లేవనే ఫీడ్ బ్యాక్ వస్తోందని... అలా జరగకుండా చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉండేదని... వేసిన రోడ్లు కూడా నాణ్యత లేకపోవడంతో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రోడ్ల పరిస్థితి మారలేదనే భావన ప్రజల్లో ఉండకూడదు... అందుకే గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తక్షణం పాడైన రోడ్లను బాగుచేసే పనులను ప్రారంభించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అవినీతి ఉండకూడదు...
ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌరసేవలపైనా ముఖ్యమంత్రి సమీక్షలో చర్చించారు. రిజిస్ట్రేషన్ సేవలు, పారిశుద్ధ్య, రేషన్ పంపిణీ, దీపం-2.0 వంటి పథకాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ల సేవల విషయంలో పనితీరు కొంతమేర మెరుగైందని అన్నారు. కొన్ని చోట్ల కొందరు అధికారుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని... దీన్ని సరిచేసుకునేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. రెండున్నర నెలల్లో రిజిస్ట్రేషన్ సేవల్లో తాను ఆశించిన మార్పులు కన్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.