మూడు రోజులు వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
Telangana, Andhra Pradesh Weather update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

ఉపరితల ఆవర్తనం
వాయవ్య బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే 24 గంటల్లో విస్తృత వర్షాల అవకాశముందుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఈ ఆవర్తనం, త్వరలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లోపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. pic.twitter.com/99ftmwOAqv
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 25, 2025
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో వాతావరణం మిక్స్‌గా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. కానీ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం కారణంగా మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడతాయని సూచన. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నమోదు కానున్నది.
అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అంచనాలు వున్నాయి.
హెచ్చరికలు
విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరిస్తోంది. పిడుగులు పడే సమయాల్లో బహిరంగ ప్రదేశాలు, చెట్ల క్రింద నిలబడవద్దు. గోడలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర కూడా భద్రతా జాగ్రత్తలు పాటించాలి. ఈ సందర్భంగా గాలి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.