- Home
- Andhra Pradesh
- Andhra pradesh: రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం.? మీరు కూడా సలహా ఇవ్వొచ్చు, ఎలాగంటే..
Andhra pradesh: రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం.? మీరు కూడా సలహా ఇవ్వొచ్చు, ఎలాగంటే..
Andhra: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలో.. మీరే చెప్పాలంటూ.. ప్రజలను సలహా కోరింది కూటమి సర్కార్. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఈమెయిల్ ఐడీను సైతం రూపొందించింది. మరి మీరేం సలహా ఇస్తారో చెప్పండి.

నిరుపయోగంగా రుషికొండ ప్యాలెస్
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మించిన విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్.. ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా, ఆ భవనాల సమూహాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది.
ప్రజల అభిప్రాయాల సేకరణ
ఇన్ని నెలల ప్రణాళికలు, ఆలోచనలు అనంతరం కూటమి ప్రభుత్వం చివరికి ఈ రుషికొండ ప్యాలెస్, ఆ పక్కనే ఉన్న 9 ఎకరాల భూమిని దేనికి ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రజల అభిప్రాయాలను కోరారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్యాలెస్‌ను లాభదాయకంగా ఉపయోగించుకోవడం కోసం రాష్ట్ర ప్రజల నుంచి విలువైన, పర్యాటక ఆధారిత సూచనలను ఆహ్వానించింది. తద్వారా ప్యాలెస్‌పై రాబడిని పొందొచ్చునని భావిస్తోంది.
ఏడు రోజుల్లోపు సూచనలు
ఏడు రోజుల్లోపు ఈ-మెయిల్ ద్వారా సూచనలను ఆహ్వానించగా.. ఈ భవనాలను తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా ఒక ప్రణాళికను ఖరారు చేసే ముందు విభిన్న అభిప్రాయాలను తీసుకోవడానికి విజయవాడలో జాతీయ, అంతర్జాతీయ ఆపరేటర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు.
రూ. 450 కోట్ల ఖర్చుతో నిర్మాణం
జగన్ ప్రభుత్వం రూ. 450 కోట్లు ఖర్చు చేసి ఈ భవనాల సమూహాన్ని నిర్మించింది. రెండోసారి అధికారంలోకి వస్తే.. అక్కడ నుంచే తమ పరిపాలనను కొనసాగించాలని భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్యాలెస్‌ను సందర్శించినప్పటికీ, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే ఓ పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పడింది.
ఈ-మెయిల్ ఐడీ ఇదిగో..
అయితే ఆ కమిటీ నుంచి ఇప్పటివరకు ఖచ్చితమైన పరిష్కారం దొరకలేదు. దీంతో ప్రజల నుంచి సలహాలు కోరాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. మీరు మీ అభిప్రాయాన్ని ప్రభుత్వంతో ఈ ఈ-మెయిల్ rushikonda@aptdc.in ఐడీ ద్వారా పంచుకోవచ్చు.