తెలుగు మహిళల కోసం వందల కోట్లు ... చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pradesh : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలుగు మహిళల కోసం వందల కోట్లు విడుదల చేశారు

స్త్రీ శక్తి పథకానికి నిధులు విడుదల
Stree Shakti Scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాదు వాటిని ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలుచేసి చేతులు దులుపుకోకుండా వాటి నిర్వహణకు టైమ్ టు టైమ్ నిధులు సమకూరుస్తోంది. దీంతో ఇప్పటివరకు అమలుచేస్తున్న పథకాలు నిరాటంకంగా సాగుతున్నాయి... ఇందులో ఒకటి స్త్రీశక్తి పథకం.
మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలుచేస్తోంది. ఈ ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు… అంటే దాదాపు మూడు నెలలగా మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్నారు. మహిళల తరపున ప్రభుత్వమే ఆర్టిసికి డబ్బులు చెల్లిస్తుంది... తాజాగా ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేాశారు.
స్త్రీ శక్తి పథకానికి రూ.400 కోట్లు రిలీజ్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కోసం రూ.400 విడుదల చేసింది... ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అటు ఆర్టిసిపై భారం పడకుండా... ఇటు మహిళలకు ఉచిత ప్రయాణం ఆగకుండా ఉండేందుకు టైట్ టు టైమ్ స్త్రీశక్తి పథకానికి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ వరకు అంటే 75 రోజులపాటు మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ప్రభుత్వం నిధులు విడుదలచేసింది.
మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన నిధులు విడుదలపై అటు ఆర్టిసి యాజమాన్యం, కార్మికులు... ఇటు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిసి కాపాడుకుంటూనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న తీరు బాగుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, కూటమి ప్రభుత్వాన్ని ఆర్టికి కార్మికులు, మహిళలు ప్రశంసిస్తున్నారు.
ఇప్పటివరకు ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారు?
ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్ట్ 15 నుండి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది... మహిళలు ఉచితంగానే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 15 నాటికి 3.17 కోట్లమంది మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణించినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంపక్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందుకుగానే ఆర్టిసి 118 కోట్ల రూపాయలను భరించిందని మంత్రి తెలిపారు.
ఈ లెక్కన అక్టోబర్ చివరినాటికి దాదాపు ఏడెనిమిది కోట్లమంది ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించివుంటారు. ఇందుకోసం ఆర్టిసి రూ.300 నుండి రూ.400 కోట్లవరకు భరించి ఉంటుంది. ఈ నిధులను విడుదల చేయడంద్వారా ఆర్టిసిపై భారం తగ్గింది... ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తూ మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే వెసులుబాటు కలిగింది. ప్రభుత్వం ఇలాగే సహకరిస్తే స్త్రీశక్తి పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ ఫుల్ గా సాగుతుందని ఆర్టిసి అధికారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ
ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసిలోని అల్ట్రా లగ్జరీ, ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఈ స్త్రీ శక్తి పథకం వర్తించదు. అంటే నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు... మిగతా పల్లె వెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సులు, ఎక్స్ ప్రెస్ లు, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రంలోని 74 శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఆధార్ కార్డు ఉంటే చాలు... ఎక్కడికైనా వెళ్లొచ్చు
బస్సు ప్రయాణంలో మహిళలు కేవలం ఆదార్ కార్డు మాత్రమే కాదు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డును కూడా అడ్రస్ గుర్తింపు కోసం చూపించవచ్చు. దీన్ని పరిశీలించి కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. అయితే ఆ ప్రయాణం ద్వారా సదరు మహిళకు ఎంత లాభం జరిగిందో టికెట్ పై పేర్కొంటారు. ఇలా స్త్రీశక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా అమలుచేస్తోంది… మహిళలు ఆనందంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.