కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్‌-19 దెబ్బకు ప్రపంచం తలుపులు మూసుకున్నాయి. అభివృద్ది చెందిన దేశాలు, వెనకబడ్డ దేశాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలు ఈ మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్నాయి. 

ఈ సమయంలో ఇంట్లోంచి బయటకు రావటం అంటేనే చాలా సాహసోపేతమైన నిర్ణయం. అలాంటిది ఇక జనసమ్మర్థ ప్రాంతాల్లోకి రావడమంటే...  ప్రాణ సంకటమే! ఇందుకోసమే ప్రపంచ దేశాలన్నీ జన సమ్మర్ధ ప్రాంతాలను లాక్ డౌన్ విధించేకన్నా ముందే మూసేసాయి. ఈ నిర్ణయాల వల్ల కారణంగా క్రీడా రంగం పూర్తిగా స్తంభించింది. 

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ నుంచి మొదలు ఐపీఎల్ సీజన్ వరకు అన్ని ఈవెంట్స్ దాదాపుగా రద్దవడమో, లేదా వాయిదా పడడంతో జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన, నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఒలింపిక్స్ కూడా సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. 

కరోనాతో ప్రపంచం పోరాడుతున్న క్లిష్ట సమయంలో ఓ దేశం ఫుట్‌బాల్‌ సీజన్‌ను ఆరంభించేందుకు రంగం సిద్ధం చేసింది. మాజీ సోవియట్‌ యూనియన్‌ లో అంతర్భాగం, ప్రస్తుత తుర్కమేనిస్థాన్‌లో ఇప్పటి వరకూ కరోనా కేసు ఒక్కటీ కూడా నమోదు కాలేదు( ఆ దేశ లెక్కల ప్రకారం). 

దేశంలో ఎక్కడా కరోనా జాడ లేనప్పుడు, స్పోర్ట్స్‌ లీగ్‌ ఎందుకు ఆగిపోవాలని భావించిన నిర్వాహకులు సాకర్‌ సీజన్‌ ప్రారంభం కోసం విజిల్‌ వేశారు. క్రీడా వినోదం రోగ నిరోధక శక్తిని మరింత శక్తిమంతం చేయగలదని అక్కడి క్రీడా నిర్వాహకులు నమ్ముతున్నారు. 

మాజీ సోవియట్‌ యూనియన్‌ రాష్ట్రాలు తజకిస్థాన్‌, బెలారస్‌లో సైతం కోవిడ్‌-19 కారణంగా క్రీడా టోర్నీలు నిలిచిపోలేదు. మైదానాలకు అభిమానులను అనుమతించటం పట్ల బెలారస్‌ ప్రభుత్వం హెచ్చరిస్తూన్నా.. తజకిస్థాన్‌ అభిమానులు లేకుండా మ్యాచులు నిర్వహిస్తోంది. ' మా దగ్గర కరోనా వైరస్‌ మహమ్మారి లేదు. ఇక మేం ఎందుకు స్పోర్ట్స్‌ సీజన్‌ను పున ప్రారంభం చేయకూడదు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఆదివారం తుర్కమేనిస్థాన్‌ రాజధాని ఆశ్గాబాత్ లో జరిగే మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.