వరల్డ్ కప్ గెలవాలా నాయనా.. అయితే ఆ టీమ్‌తో జట్టుకట్టాల్సిందే..
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా.. ఫ్రాన్స్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. మెస్సీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ట్విటర్ లో పారిస్ ఫుట్‌బాల్ క్లబ్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇంతకీ ఆ క్లబ్ చేసిన మాయాజాలం ఏమిటి..? ఆ క్లబ్ లో చేరితే ప్రపంచకప్ గెలిచినట్టేనా..?
అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య ముగిసిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సారథి మెస్సీ వరల్డ్ కప్ గెలవగానే ట్విటర్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న పీఎస్జీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరూ వరల్డ్ కప్ గెలవాలంటే పీఎస్జీ లో చేరాలని, చరిత్ర కూడా అదే చెబుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి పీఎస్జీ..? దీనికి, వరల్డ్ కప్ కు సంబంధమేంటి..?
యూరోపియన్ దేశాలలో ఫుట్‌బాల్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇక్కడ జాతీయ జట్లు ఎప్పుడో ప్రధాన టోర్నీలు ఉంటే తప్ప నేరుగా మ్యాచ్ లు ఆడవు. అంతా క్లబ్, ఫ్రాంచైజీ గేమ్స్‌దే ఆధిపత్యం. ఇదే క్రమంలో పుట్టుకొచ్చిన ఫుట్‌బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మెన్ (పీఎస్జీ).
మెస్సీ ప్రపంచకప్ గెలవడానికి, పీఎస్జీకి సంబంధమేమిటి..? అనుకుంటున్నారా..? ఒక్క మెస్సీకే కాదు. ఫ్రాన్స్ హీరో ఎంబాపేకు కూడా పీఎస్జీతో సంబంధాలున్నాయి. పీఎస్జీతో చేరితే ప్రపంచకప్ కొట్టేసినట్టేనని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి సాలిడ్ రీజన్ కూడా ఉంది.
2001లో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డీనో పీఎస్జీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2002తో బ్రెజిల్ వరల్డ్ కప్ నెగ్గింది. 2017లో ఎంబాపే పీఎస్జీతో చేరాడు. 2018లో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక 2021లో అర్జెంటీనా హీరో లియోనల్ మెస్సీ కూడా పీఎస్జీతో ఆడటానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 2022లో అర్జెంటీనా టోర్నీ నెగ్గింది. దీంతో వరల్డ్ కప్ కు ముందు పీఎస్జీలో చేరితే విశ్వ విజేతగా నిలిచినట్టేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
యూరప్ తో పాటు ప్రపంచ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అంతా పీఎస్జీ, పారిస్ ఎస్జీ అని పిలుచుకునే ఈ క్లబ్ కు ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పటివరకు నలభై అధికారిక టోర్నీలు గెలిచిన ఈ క్లబ్.. 1970 నుంచే పారిస్ లో సంచలన విజయాలతో దూసుకెళ్లుతున్నది. యూరోపియన్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఈ జట్టు.. కోప్ ఆఫ్ ఫ్రాన్స్, లా లిగా, యూఈఎఫ్ఎ, కోప్ డి లా లీగ్ వంటి మెగా టోర్నీలను నెగ్గింది. మెస్సీ వరల్డ్ కప్ నెరవేరిన నేపథ్యంలో 2025లో పీఎస్జీతో కాంట్రాక్టు కుదుర్చుకునే ఆటగాళ్ల సంఖ్య ఇలా ఉంటుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మెస్సీతో పాటు బ్రెజిల్ సూపర్ స్టార్ నేమర్ జూనియర్, ఎంబాపే కూడా పీఎస్జీ తరఫునే ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం.