మ్యాచ్ జరుగుతుండగానే గోల్ కీపర్‌పై కర్రతో రెండుసార్లు దాడి.. వీడియో వైరల్
క్రీడల్లో ప్రత్యర్థి ఆటగాళ్లపై ద్వేషం ఉండటం సాధరణమే. కానీ ఏకంగా మ్యాచ్ జరుగుతుండగానే వారిపై దాడి చేయడం మాత్రం అరుదు. తాజాగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ లో దుండగుడు నేరుగా ఆటగాడి దగ్గరికెళ్లి..
ఆటల్లో వైరం సర్వసాధారణాంశం. తమకు నచ్చని ఆటగాళ్ల మీద ద్వేషం పెంచుకోవడంలో ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ఫ్యాన్స్ హద్దులుమీరుతుంటారు. క్రికెట్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అభిమానులు బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేసే క్రికెటర్లపై వాటర్ బాటిళ్లు విసరడం, స్లెడ్జింగ్ చేయడం వంటివి షరామామూలే. ఫుట్‌బాల్ ఆటలో కూడా ఇలాంటివి చూస్తుంటాం. కానీ నేరుగా ఆటగాళ్ల దగ్గరికెళ్లి కర్రలతో దాడి చేయడం వంటివి చాలా అరుదు. కానీ తాజాగా టర్కీ ఫుట్‌బాల్ క్లబ్ లో మాత్రం ఓ అభిమాని హద్దులు మీరి గోల్ కీపర్ దగ్గరికెళ్లి రక్తం వచ్చేలా బాదాడు.
టర్కీ లోని ఓ ఫుట్‌బాల్ క్లబ్ లో అల్టే - గొజ్టేపె మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అల్టేకు చెందిన గోల్ కీపర్ వొజన్ ఎవ్రిమ్ ఓజెన్ పై దుండగుడు దాడికి దిగాడు. రెండు సార్లు అతడిపై దాడికి దిగి రక్తం వచ్చేలా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
వీడియో ప్రకారం.. అల్టే గోల్ కీపర్ వొజన్ ఎవ్రిమ్ పై ఆట ఫస్టాఫ్ లో సదరు అభిమాని దాడికి దిగాడు. కానీ తన సహచర ఆటగాళ్ల మద్దతుతో వొజన్ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే అంబులెన్స్ వచ్చి వొజన్ కు తాకిన చిన్న గాయాలకు చికిత్స అందిస్తుండగా ఈసారి దుండగుడు ఏకంగా ఫ్లాగ్ కు ఉంచే కర్రతో అతడి మీద దాడిచేశాడు. వెనకాల నుంచి వచ్చి వొజన్ నెత్తిమీద రెండు సార్లు బాదాడు. దీంతో అక్కడున్న ఇద్దరు ఆటగాళ్లు భయంతో పరుగు లంకించుకున్నారు.
కానీ కొంత దూరం నుంచి వేగంగా వచ్చిన సిబ్బంది, ఇతర ఆటగాళ్లు దుండగుడిని పట్టుకున్నారు. వెంటనే వొజన్ ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనతో మ్యాచ్ ను అర్థాంతరంగా నిలిపేశారు. అయితే సదరు నిందితుడు.. వొజన్ పై ఎందుకు దాడి చేశాడు..? అనేది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం వొజన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తున్నది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే స్టేడియంలో మంటలు వ్యాపించి కూడా పలువురు గాయపడ్డట్టు సమాచారం.