Asianet News TeluguAsianet News Telugu

FIFA 2022: ఆదివారం ఆఖరి పోరాటం.. ఫైనల్‌లో వీరి ఆట చూడాల్సిందే..

FIFA World Cup 2022: అరబ్బుల అడ్డా ఖతర్ వేదికగా  గత నెల 20న  ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్  తుది దశకు చేరింది. 32 జట్లు పోటీ పడిన ఈ  మెగా టోర్నీలో 63 మ్యాచ్‌లు ముగిశాయి. ఇక మిగిలింది ఫైనల్ మాత్రమే. ఈనెల 18 (ఆదివారం)న ఫైనల్ జరగాల్సి ఉంది. 
 

These Players to Watch in Argentina - France FIFA World Cup Final 2022
Author
First Published Dec 16, 2022, 9:00 AM IST

32 దేశాలు.. వందలాది మంది ఆటగాళ్లు.. లక్షలాది అభిమానులు.. వెరసి ఫిఫా ప్రపంచకప్ తుది అంకానికి చేరుకున్నది.  నాలుగేండ్లకోసారి జరిగే ఈ  వరల్డ్‌కప్  టోర్నీలో ఆదివారం  అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరుగనుంది.   1986 తర్వాత మళ్లీ విశ్వవిజేతగా అవతరించాలని  అర్జెంటీనా భావిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో  బరిలోకి దిగిన ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి ప్రపంచకప్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో  ఫైనల్ మ్యాచ్ లో వీరి ఆటను మాత్రం అస్సలు మిస్ కావొద్దు.. 

లీగ్ దశలో సౌదీ అరేబియా చేతిలో ఓడినా తర్వాత పుంజుకున్న అర్జెంటీనా జట్టు.. ఫైనల్ కోసం  అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. లియోనల్ మెస్సీ సారథ్యంలోని  అర్జెంటీనాలో అతడే   సూపర్ స్టార్. మెస్సీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు  కూడా ఆ జట్టులో కీలకం. వాళ్లిద్దరే  ఫార్వర్డ్ ప్లేయర్ జులియన్ అల్వరెజ్, మరొకరు గోల్ కీపర్ ఎమిలియానో మార్టిన్. 

మెస్సీ మీదే కళ్లన్నీ.. 

తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న  మెస్సీ ఇప్పటికే  ఈ టోర్నీలో ఐదు గోల్స్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్నాడు.  టోర్నీ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ అర్జెంటీనా విజయాలలో అతడిదే కీలక పాత్ర.  పెనాల్టీ కిక్ లతో పాటు  బంతిని పాస్ చేస్తూ  గోల్స్ చేస్తున్న మెస్సీ ఆట  చూడాల్సిందే.  తన కెరీర్ లో  బలన్ డివోర్,  ఛాంపియన్ లీగ్ టైటిల్స్, లా లిగా టైటిల్స్ నెగ్గిన  మెస్సీకి లోటుగా  ఉన్న  ప్రపంచకప్ కిరీటాన్ని కూడా దక్కించుకోవాలని యావత్ అర్జెంటీనాతో పాటు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు కోరుకుంటున్నారు. 

 

అల్వరెజ్ అదుర్స్.. మార్టినా మజాకా.. 

22 ఏండ్ల ఈ కుర్రాడు ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ లలో తుది జట్టులో లేడు. కానీ  తర్వాత  అతడే గేమ్ ఛేంజర్ అయ్యాడు. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ నుంచి  రౌండ్ ఆఫ్ 16లో ఆస్ట్రేలియా మీద,  క్వార్టర్స్ లో నెదర్లాండ్స్ పై, సెమీస్ లో  క్రొయేషియాపై గోల్ కొట్టాడు. ఈ టోర్నీలో మెస్సీ తర్వాత అర్జెంటీనా నుంచి అత్యధిక గోల్స్ చేసింది  అల్వరెజే కావడం గమనార్హం. 

ఇక గోల్ కీపర్ మార్టిన్ గురించి  ఎంత చెప్పుకున్నా తక్కువే. క్వార్టర్స్ లో నెదర్లాండ్స్ తో  మ్యాచ్ లో  అర్జెంటీనా గట్టెక్కడానికి మార్టినే కారణం.  నెదర్లాండ్స్ దాడిని పటిష్టంగా అడ్డుకుని అర్జెంటీనా జట్టుకు రక్షణ కవచంలా మారాడు. 

ఫ్రాన్స్ నుంచి.. 

ఇక డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న  ఫ్రాన్స్ నుంచి సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె, ఒలివీర్ గిరోడ్ ఆంటోని  గ్రీజ్‌మన్  కీలక ఆటగాళ్లు. 

 

ఎదురేలేని ఎంబాపె.. 

లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్ లలో కాస్త నిరాశపరిచిన ఎంబాపె తర్వాత పుంజుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఐదు గోల్స్ కొట్టి అత్యధిక గోల్స్ కొట్టినవారిలో మెస్సీతో సమానంగా నిలిచాడు.  2018లో  ఫ్రాన్స్ విజయాలలో కీలకంగా వ్యవహరించిన ఈ స్టార్ రెచ్చిపోతే అర్జెంటీనాకు తిప్పలు తప్పవు. 

ఒలివీర్ గిరోడ్.. 

ఫ్రాన్స్ సూపర్ స్ట్రైకర్ కరీమ్ బెంజెమా గాయంతో ఫిఫాకు దూరం కావడంతో  ఒలివీర్ మీద ఫ్రాన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ఒలివీర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఒలివీర్ ఇప్పటికే నాలుగు గోల్స్ చేశాడు. 

ఆంటోని గ్రీజ్‌మన్.. 

ఆంటోని ఈ టోర్నీలో ఇంతవరకూ ఒక్క గోల్ కూడా చేయలేదు.  కానీ ప్రత్యర్థుల దగ్గర్నుంచి బంతిని  చాకచక్యంగా తప్పించి తన ఆటగాళ్లకు అందించడంలో  ఆంటోని కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్ చేసిన గోల్స్ లో అధికభాగం  ఆంటోని పాత్ర ఉందంటే అతిశయెక్తి కాదు. 

Follow Us:
Download App:
  • android
  • ios