FIFA: పది ఖాయం.. ఆ ఆరు జట్లేవి..? రౌండ్ - 16కు చేరే టీమ్స్ పై ఆసక్తి
FIFA World Cup 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 3 నుంచి రౌండ్ -16 మొదలుకాబోతుంది.
ఫిఫా ప్రపంచకప్ లో తొలుత భారీ సంచలనాలు నమోదైనా తర్వాత అగ్రశ్రేణి జట్లు చెమటోడ్చి ముందు దశకు అడుగేశాయి. ఈ మెగా ఈవెంట్ లో మొదటి రౌండ్ మ్యాచ్ లు దాదాపు తుది అంకానికి చేరుకున్నాయి. డిసెంబర్ మూడు నుంచి కీలకమైన రౌండ్ -16 మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ రౌండ్ కు అర్హత సాధించిన జట్లేవి..? ఎలిమినేట్ అయిన టీమ్స్ ఏవి..? పోటీలో ఉన్న మిగిలిన ఆరు జట్లేవి..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలివిగో..
ఐదు దశలు (గ్రూప్ స్టేజ్, రౌండ్ -16, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్)గా సాగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ లో 32 జట్లు తలపడ్డాయి. ఇందులోంచి 16 జట్లు రౌండ్ - 16కు చేరతాయి. ఈ రౌండ్ లో 8 జట్లు క్వార్టర్స్ కు వెళ్తాయి. ఆ దశలో నాలుగు జట్లు సెమీస్ చేరతాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ లో తలపడతాయి.
ఈ టోర్నీలో ఇప్పటికే రౌండ్ -16కు చేరిన జట్లు :
- ఫ్రాన్స్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, సెనగల్, ఇంగ్లాండ్, యూఎస్ఎ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, పోలండ్ (10 టీమ్స్)
ఎలిమినేట్ అయిన టీమ్స్ :
- ఈక్వెడార్, ఖతర్, ఇరాన్, వేల్స్, కెనడా, ట్యూనిషియా, మెక్సికో, సౌదీ అరేబియా (9 జట్లు)
19 జట్లు పోను మిగిలిన 13 జట్లు ఆరు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో అధికారికంగా గ్రూప్-ఎ, బి, సి నుంచి క్వాలిఫై, ఎలిమినేట్ అయిన జట్లు ఉన్నాయి. గ్రూప్ - డీలో ట్యూనిషియా, డెన్మార్క్ లు అనధికారికంగా నిష్క్రమించినట్టే.
గ్రూప్ - ఇలో రసవత్తర పోరు..
గ్రూప్ - ఇ లో రసవత్తర పోరు జరుగుతోంది. స్పెయిన్, జపాన్, కోస్టారికా, జర్మనీ లు ఉన్న ఈ గ్రూప్ లో ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్ లు ఆడాయి. ప్రస్తుతం స్పెయిన్ కు 4, జపాన్, కోస్టారికాకు మూడు, జర్మనీకి ఒక పాయింట్ మాత్రమే ఉన్నాయి. జర్మనీ రెండింటిలో ఒకటి ఓడి ఒకటి డ్రా చేసుకుంది. రౌండ్ -16కు వెళ్లాలంటే ఆ జట్టు కోస్టారికాతో ఆడే మ్యాచ్ ను తప్పకుండా గెలవాలి. కోస్టారికాతో గెలవడమే కాదు.. స్పెయిన్ - జపాన్ ల మధ్య మ్యాచ్ లో జపాన్ గెలిస్తే జర్మనీకి అవకాశాలుంటాయి. స్పెయిన్ - జపాన్ మ్యాచ్ డ్రా అయితే.. కోస్టారికాపై జర్మనీ భారీ తేడాతో నెగ్గాలి. కనీసం 8 గోల్స్ చేస్తే జర్మనీకి రౌండ్ - 16 కు ఛాన్స్ ఉంటుంది. స్పెయిన్ గనక జపాన్ ను ఓడిస్తే జర్మనీ కథ కంచికే.
స్పెయిన్.. జపాన్ ను ఓడిస్తే ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా రౌండ్ - 16కు చేరుతుంది. ఓడితే మాత్రం.. జర్మనీని కోస్టారికా ఓడించాలి. జపాన్ పరిస్థితి కూడా అంతే. స్పెయిన్ ను ఓడిస్తే ముందడుగు వేయడం పక్కా. ఓడితే జపాన్ కూడా జర్మనీ మ్యాచ్ మీద ఆశలుపెట్టుకోవాల్సిందే.ఇక కోస్టారికా ముందుకెళ్లాలంటే.. జర్మనీని ఓడించాలి. డ్రా అయితే స్పెయిన్ - జపాన్ ఫలితం మీద ఆధారపడాల్సి వస్తుంది.
గ్రూప్ - ఎఫ్ లో క్రొయేషియా, మొరాకో, బెల్జియం, కెనడా ఉండగా క్రొయేషియా, మొరాకోకు అవకాశాలున్నాయి. గ్రూప్ - జీ లో బ్రెజిల్ క్వాలిఫై అవగా తర్వాత ఛాన్స్ స్విట్జర్లాండ్ కు ఉంది. గ్రూప్ - హెచ్ లో పోర్చుగల్ క్వాలిఫై అవగా ఘనా, సౌత్ కొరియాలకు రెండో బెర్త్ అవకాశముంది.