Asianet News TeluguAsianet News Telugu

ఇండియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతామన్న అర్జెంటీనా! లియెనెల్ మెస్సీ వస్తానంటే మా వల్ల కాదంటూ...

ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలని అనుకున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 ఛాంపియన్ అర్జెంటీనా... అయితే మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్.. 

Team India football team rejected friendly match with Fifa World cup 2022 Champion Argentina, here why CRA
Author
First Published Jun 20, 2023, 4:22 PM IST | Last Updated Jun 20, 2023, 4:22 PM IST

లియోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్. 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన లియోనెల్ మెస్సీ కెప్టెన్‌గా ఉన్న అర్జెంటీనా టీమ్, టీమిండియాలో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలని అనుకుంది. దేశంలో ఫుట్‌బాల్‌కి ఆదరణ లేక బిక్కుబిక్కుముంటున్న భారత ఫుట్‌బాల్ టీమ్‌కి ఇది సువర్ణావకాశం.. అయితే ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) మాత్రం మా వల్ల కాదని చేతులు ఎత్తేసింది..

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్, ఫ్రెండ్లీ మ్యాచులు ఆడేందుకు అంతర్జాతీయ షెడ్యూల్‌లో రెండు స్లాట్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఓ స్లాట్‌లో ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌తో మ్యాచ్ ఆడాలని అనుకుంది. అయితే అంత బడ్జెట్ మా వల్ల కాదంటూ భారత ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ... భారత్‌లో ఫుట్‌బాల్‌ ఆట దశని తిప్పే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించేసింది..

ఈ విషయాన్ని ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ప్రభాకరన్ బయటపెట్టాడు..‘అర్జెంటీనా వంటి టీమ్‌తో మ్యాచ్ ఆడాలంటే మనకి మంచి బ్యాకప్ కావాలి. వాళ్ల దగ్గర బలమైన టీమ్ ఉంది. అంతేకాకుండా అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫెడరేషన్ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. మన దగ్గర అలాంటి పరిస్థితి. మనదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ఇచ్చే బడ్జెట్‌తో అర్జెంటీనాతో మ్యాచ్ కాదు కదా, వాళ్ల టీమ్‌కి బూట్లు కూడా కొనలేం... అందుకే ఆడలేమని చెప్పేశాం..’ అంటూ కామెంట్ చేశాడు షాజీ ప్రభాకరన్..

ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత అర్జెంటీనా, వరల్డ్‌లో మోస్ట్ డిమాండింగ్ ఫుట్‌బాల్ టీమ్‌గా మారింది. ఒక్కో మ్యాచ్‌కి మెస్సీ టీమ్‌ దాదాపు 4 నుంచి 5 మిలియన్ డాలర్ల దాకా తీసుకుంటోంది. మన బడ్జెట్‌లో ఇది 32 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల దాకా ఉంటుంది..

జూన్‌లో ఇండియాలో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి, బంగ్లాదేశ్‌తో రెండో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాలనుకుంది అర్జెంటీనా. అయితే ఇంత తక్కువ సమయంలో అర్జెంటీనాతో మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయలేమని బంగ్లాదేశ్ కూడా చేతులు ఎత్తేసింది. 

దీంతో భారత్‌తో మ్యాచ్ ఆడాల్సిన స్లాట్స్‌లో ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతో మ్యాచులు ఆడింది అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్.. బిజీంగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లియెనెల్ మెస్సీ, తన కెరీర్‌లో ఫాస్టెస్ట్ గోల్ సాధించి, అర్జెంటీనాకి 2-0 తేడాతో ఘన విజయం అందించాడు..

ఆ తర్వాత ఆదివారం ఇండోనేషియాతో జరిగిన రెండో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 2-0 విజయం అందుకుంది అర్జెంటీనా. ప్రస్తుతం భారత జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో 99వ ర్యాంకులో కొనసాగుతుంటే అర్జెంటీనా, ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉంది..

2023లో భువనేశ్వర్‌లో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌ ఫైనల్‌లో లెబనాన్‌ టీమ్‌పై 2-0 తేడాతో విజయం అందుకుంది భారత ఫుట్‌బాల్ టీమ్. ఈ మ్యాచ్‌కి ముందు భారత జట్టు ఫిపా ర్యాంకు 101. ఇంటర్‌కాంటినెంటల్ కప్‌ 2023 విజయంతో టీమిండియా, రెండు పాయింట్లు ఎగబాకి 99వ ర్యాంకుకి చేరుకుంది.

భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ 87 ఇంటర్నేషనల్ గోల్స్‌తో ప్రస్తుత తరంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ప్లేయర్ల లిస్టులో క్రిస్టియానో రొనాల్డో (122 అంతర్జాతీయ గోల్స్), లియెనెల్ మెస్సీ (103 ఇంటర్నేషనల్ గోల్స్) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios