రణరంగంగా మారుతున్న భారత ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. వరుసగా మూడో మ్యాచ్‌లో ఆగని లొల్లి..
SAFF Championship 2023: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ పోటీలలో భారత్ ఆడే మ్యాచ్‌లు రణరంగంగా మారుతున్నాయి.
బెంగళూరు వేదికగా ఇటీవలే ఆరంభమైన శాఫ్ టోర్నీలో భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ రణరంగంగా మారుతున్నది. ఆటతో పాటు ఆన్ ఫీల్డ్ లో భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటున్నారు. పలుమార్లు ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వించగా కొన్నిసార్లు ఆటలో భావోద్వేగాలు, పరిస్థితుల కారణంగా వాగ్వాదాలు కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీస్తున్నాయి. భారత్ - పాకిస్తాన్, భారత్ - నేపాల్ తో పాటు నిన్న బెంగళూరులో జరిగిన భారత్ - కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు.
భారత్ - కువైట్ మధ్య కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో భాగంగా 64వ నిమిషయంలో టీమిండియా కోచ్ ఇగోర్ స్టిమాక్ మరోసారి రిఫరీ ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడనే నెపంతో ఆయనకు మరోసారి రెడ్ కార్డ్ చూపించారు రిఫరీలు.
అచ్చం భారత్ - పాకిస్తాన్ లో మ్యాచ్ మాదిరిగానే గొడవ మొదలైందే ఆయనతో కాగా ఆటగాళ్లు వచ్చి వాగ్వాదానికి దిగడం.. ఇరు ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ సహనాన్ని కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ ను కిందకు తోసేశాడు. దీంతో ఆటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. దీంతో పలువురు ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు.
నేపాల్‌తో మ్యాచ్ లో..
గత శనివారం భారత్ - నేపాల్ మ్యాచ్ లో కూడా ఇదే తరహా గొడవ జరిగింది. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్ లో గొడవపడ్డారు. ఈ ఇద్దరి మధ్య గొడవ చినికి చినికి గాలివాన అయింది. ఇరు జట్ల ఆటగాళ్లల మధ్య తోపులాటలు సంభవించాయి.
పాకిస్తాన్ తో..
భారత్ - పాక్ మ్యాచ్ లో భాగంగా ప్రథమార్థం కొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకదశలో భారత్ - పాక్ ఆటగాళ్లకు కొట్టుకునేదాకా వెళ్లారు. పాక్ ఆటగాడు బంతిని విసరబోతుండగా భారత కోచ్ ఇగార్ స్టిమాక్ వెనుకనుంచి తన చేత్తో బంతిని నెట్టేశాడు. దీంతో పాక్ ఆటగాళ్లు కోచ్ పైకి దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. ఇది చూసిన భారత ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసేసుకుని వాదులాడుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రిఫరీలు ఇండియా కోచ్ కు రెడ్ కార్డ్ చూపించారు.
భారత్ - కువైట్ మ్యాచ్ డ్రా..
ఇక మంగళవారం భారత్ - కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ ఫస్టాఫ్ ఎక్స్ట్రా టైమ్ లో సునీల్ ఛెత్రి భారత్ తరఫున తొలి గోల్ చేశాడు. రెండో అర్థభాగం ముగిసే క్రమంలో సెకండాఫ్ ఎక్స్ట్రా టైమ్ (92వ నిమాషం)లో అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేశాడు. కువైట్ ఆటగాళ్లు గోల్ కొట్టే క్రమంలో దానిని సమర్థవంతంగా అడ్డుకున్న అన్వర్ అలీ.. పొరపాటుగా దానిని భారత గోల్ పోస్ట్ లోకే పంపాడు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో గ్రూప్ - ఎలో భారత్ (7) కంటే కువైట్ కు ఎక్కువ గోల్స్ (8) ఉండటంతో ఆ జట్టు అగ్రస్థానం దక్కించుంకుంది.