SAFF Championship 2023: ఛెత్రి హ్యాట్రిక్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్..
SAFF Championship 2023: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్ఎఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా జరుగుతున్న శాఫ్ ఛాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది.
ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన భారత జట్టు శాఫ్ ఛాంపియన్‌షిప్ ను కూడా ఘనంగా ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్ లోనే 4-0 గోల్స్ తో పాక్ ను మట్టి కరిపించింది. భారత సారథి సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్‌కు గోల్ చేయడానికి అవకాశమే ఇవ్వకుండా భారత్ సమర్థవంతంగా డిఫెండ్ చేసుకుంది.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో బుధవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత హవా సాగింది. ఇంటర్ కాంటినెంటల్ టోర్నీలో జోరును కొనసాగిస్తూ.. సునీల్ ఛెత్రి ఆట పదో నిమిషంలోనే తొలి గోల్ కొట్టాడు. తొలి గోల్ చేసిన ఊపులో ఛెత్రి మరో ఆరు నిమిషాలకే రెండో గోల్ కూడా చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లాడు.
భారత్ - పాక్ ఆటగాళ్ల వాగ్వాదం..
ప్రథమార్థం కొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకదశలో భారత్ - పాక్ ఆటగాళ్లకు కొట్టుకునేదాకా వెళ్లారు. పాక్ ఆటగాడు బంతిని విసరబోతుండగా భారత కోచ్ ఇగార్ స్టిమాక్ వెనుకనుంచి తన చేత్తో బంతిని నెట్టేశాడు. దీంతో పాక్ ఆటగాళ్లు కోచ్ పైకి దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. ఇది చూసిన భారత ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసేసుకుని వాదులాడుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రిఫరీలు ఇండియా కోచ్ కు రెడ్ కార్డ్ చూపించారు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
ఛెత్రి హ్యాట్రిక్..
ఆట రెండో భాగంలో పాక్ భారత దాడిని బాగానే డిఫెండ్ చేసింది. అయితే ఆట 74వ నిమిషంలో పాక్ ఆటగాళ్లు ఛెత్రిని కిందపడేయడంతో భారత్‌కు ఫెనాల్టీ కిక్ దక్కింది. ఛెత్రి దానిని గోల్ గా మలిచి హ్యాట్రిక్ గోల్ కొట్టాడు. మరో ఏడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇండియా సబ్ స్టిట్యూట్ ఉదంద సింగ్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 4-0 కు చేర్చాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోవడంతో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది.