FIFA: అంగట్లో ఫిఫా ట్రోఫీలు.. ఖతార్ లో నకిలీ ట్రోఫీల గుట్టు రట్టు
FIFA World Cup 2022: ఫుట్‌బాల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ - 2022’ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఖతార్ లో ఫిఫా ట్రోఫీతో పోలిన నకిలీ ట్రోఫీలు అంగట్లో ప్రత్యక్షమవుతున్నాయి.
ఈనెల 20 నుంచి ఎడారి దేశం ఖతార్ వేదికగా ప్రారంభంకానున్న ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ -2022 కోసం ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నది. యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు ఈ మెగా ఈవెంట్ కోసం ఉత్కంఠగా ఉన్నారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన విజేతలకు ఇచ్చే ఫిఫా ట్రోఫీలు ఇప్పుడు ఖతార్ లో అంగట్లో లభ్యమవుతున్నాయి. అచ్చం అసలు ట్రోఫీలను పోలినట్టే ఉండే నకిలీ ట్రోఫీలు.. ఖతార్ మార్కెట్లలో వెలుగుచూడటంతో ఖతార్ పోలీసులు రంగలోకి దిగారు.
ఖతార్ రాజధాని దోహాలో అధికారులు ఫిఫా ట్రోఫీని పోలి ఉండే 144 నకిలీ ట్రోఫీలను సీజ్ చేశారు. ఈ మేరకు ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటిరీయర్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
నకిలీ ట్రోఫీలకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ఆర్థిక, సైబర్ నేరాల శాఖకు అందిన సమాచారం మేరకు దోహాలోని కొన్ని ప్రాంతాల్లో రైడ్ చేసింది. ఈ క్రమంలో 144 నకిలీ ఫిఫా ట్రోఫీలను సీజ్ చేశాం. ఇలా ప్రపంచకప్ కు సంబంధించిన లోగోలు, ట్రోఫీలను నకిలీవి తయారుచేయడం చట్టరీత్యా నేరం..’ అని ట్విటర్ లో పేర్కొంది.
అయితే వీటిని ఎవరు తయారుచేశారు..? ఈ ముఠా వెనుక ఎవరున్నారు..? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఫిఫా, ఖతార్ ఈ విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఏడాది జూన్ లో ఖతార్ లో పలువురు కార్ డ్రైవర్లు తమ కార్లకు ఫిఫా వరల్డ్ కప్ కు సంబంధించిన లోగోలను ముద్రించుకున్నారు. నెంబర్ ప్లేట్ లు కూడా వరల్డ్ కప్ లోగోలతో వేయించారు. వీటిని ఖతార్ ప్రభుత్వం సీజ్ చేసింది. వరల్డ్ కప్ కు చెందిన అధికారిక లోగోలను తాము ఆన్లైన్ లో ఉంచామని.. వాటిని తప్ప నకిలీ లోగులు పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నెల రోజుల క్రితం ఖతార్ పోలీసులు.. ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లపై ఫిఫా ముద్ర ఉన్న నకిలీ బట్టలను అమ్మినందుకు కూడా పలువురిపై చర్యలు తీసుకున్నారు. పలు వస్త్ర కంపెనీలపై రైడ్ చేసి వాటిని సీజ్ చేసినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి.
ఇక ఈ ప్రపంచకప్ విషయానికొస్తే.. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్ వేదికగా జరుగబోయే ఈ మెగా టోర్నీలో 32 దేశాలు పాల్గొంటున్నాయి. 8 గ్రూపులుగా విడగొట్టిన ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ వంటి దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఈ దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.