రండి బాబు రండి.. ఫ్రీ గా ఫిఫా వరల్డ్ కప్ చూపిస్తాం.. ఫేక్ ఫ్యాన్స్‌తో అబాసుపాలవుతున్న ఖతర్..!
FIFA World Cup 2022: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ప్రస్తుతం ఖతర్ లో జరుగుతున్నది 22వ ఎడిషన్. ఈ ఎడిషన్ లో జరుగుతున్నన్ని వివాదాలు మరే ప్రపంచకప్ లో జరుగలేదు.
ఈనెల 20 నుంచి ఖతర్ వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మొదలుకానుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఖతర్ గడిచిన రెండు మూడు నెలలుగా వార్తల్లో నానుతూనే ఉంది. రోజుకో కొత్త వివాదంతో ఖతర్ అబాసుపాలవుతున్నది. ఫుట్బాల్ స్టేడియం నిర్మాణాలు, మానవ హక్కుల హననం, కఠిన నిబంధనలతో ప్రపంచకప్ చూడటానికి ఎవరూ ఖతర్ కు రావడం లేదన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఖతర్ ప్రభుత్వం మరోసారి అబాసుపాలైంది.
స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటాయనే భయంతో వాటిని ఫేక్ ఫ్యాన్స్ తో నింపేయడానికి స్థానిక ప్రభుత్వం సిద్ధమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అర్జెంటీనా, ఇంగ్లాండ్, బ్రెజిల్, తదితర దేశాల నుంచేగాక ఖతర్ లో ఉండే స్థానిక వలస కూలీల (ఎక్కువ మంది భారతీయులే)కు ఫ్యాన్స్ గా డ్రెస్ లు వేసి దోహా వీధుల గుండా ఊరేగించినట్టు తెలుస్తున్నది.
ఈ మేరకు స్థానిక టిక్ టాక్ ఛానెల్స్ (ఖతారీ లివింగ్) లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గురువారం మెస్సీ దోహా ఎయిర్ పోర్టు నుంచి హోటల్ గదికి చేరుకుంటుండగా అక్కడ పలువురు ఫ్యాన్స్ అతడికి అభివాదం చేస్తూ హంగామా చేశారు. ఇదంతా ఖతర్ ప్రభుత్వం డబ్బులిచ్చి చేపించిన కథేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేగాక నవంబర్ 20న ఫిఫా ప్రారంభం సందర్భంగా నిర్వహించబోయే ప్రారంభవేడుకలకు కూడా ఫేక్ ఫ్యాన్స్ దర్శనమివ్వనున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేడియాలను ఖాళీగా ఉంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాజం చేస్తున్న అవినీతి, మానవ హక్కుల ఆరోపణలకు ఊతమిచ్చినట్టు అవుతుందని భావించిన స్థానిక ప్రభుత్వం..లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తుందన్న ఆరోపణలున్నాయి.
ఇంగ్లాండ్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన పలు కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఖతర్ కు చేరుకోగానే వారికి అభివాదం చేస్తూ వారి జాతీయ జెండాలు, జెర్సీలతో ఎదురొచ్చినవారంతా కేరళ వారేనన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఖతర్ ప్రభుత్వం, సుప్రీం కమిటీ స్పందించాయి. ఇలాంటి ఆరోపణలు చాలా దురదృష్టకరమని తెలిపాయి. ఫిఫా ప్రపంచకప్ చూసేందుకు వివిధ దేశాల నుంచి అభిమానులు తమ దేశానికి వస్తుంటే ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.