వాళ్లు చేసినట్టు మా నాన్నకు ఎందుకు చేయలేదు..? అర్జెంటీనా జట్టుపై మారడోనా కూతురు అసహనం..

FIFA WC 2022: తమ దేశాలకు  ప్రపంచకప్ లు అందించిన పీలే, మారడోనాల గురించి  ఎంత  చెప్పుకున్నా తక్కువే.   పీలే.. బ్రెజిల్‌ను  మూడుసార్లు  ప్రపంచ ఛాంపియన్ గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. మారడోనా..  అర్జెంటీనాను ఒకమారు విశ్వవిజేతగా నిలిపాడు.
 

Maradona Daughter Gianinna Takes Dig at Argentine Football Team For Ignoring Her Father

ఫుట్‌బాల్  గురించి పరిచయం ఉన్నవారికెవరికైనా  ఈ క్రీడలో దిగ్గజాలుగా వెలుగొందుతున్న  డీగో మారడోనా,  పీలే గురించి తెలియకుండా ఉండదు.  తమ దేశాలకు  ప్రపంచకప్ లు అందించిన  ఈ హీరోల గురించి  ఎంత  చెప్పుకున్నా తక్కువే.   పీలే.. బ్రెజిల్ కు మూడుసార్లు  ప్రపంచ ఛాంపియన్ గా  అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  ఇక మారడోనా..  అర్జెంటీనాను ఒకమారు విశ్వవిజేతగా నిలిపాడు. ఈ ఇద్దరిలో  మారడోనా రెండేండ్ల క్రితమే  మరణించాడు.  పీలే  ప్రస్తుతం   అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నాడు.  

ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా  ఈ ఇద్దరు దిగ్గజాల వారసులుగా పేరొందిన ఆటగాళ్లు తమ జట్లను  క్వార్టర్స్ కు చేర్చారు. సోమవారం  బ్రెజిల్ - సౌత్ కొరియాతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు మ్యాచ్ అనంతరం  పీలే పట్ల తమ ప్రేమను చాటుకున్నారు.  

గోల్ చేసిన ప్రతీసారి పీలే పీలే అంటూ అరవడమే గాక మ్యాచ్ తర్వాత  పీలే త్వరగా కోలుకోవాలని బ్యానర్ ప్రదర్శించారు. ఈ విజయాన్ని కూడా పీలేకు అంకితమిచ్చింది బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు. 

కానీ మూడు రోజుల క్రితం అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ లో  ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు మారడోనాను కనీసం తలుచుకోలేదని,  బ్రెజిల్ వాళ్లు చేసినట్టు తన తండ్రికి గౌరవ మర్యాదలు దక్కలేదని  మారడోనా కూతురు  జియానిన్ని మారడోనా  కామెంట్స్ చేసింది.  బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు తమ  మ్యాచ్ తర్వాత పీలే త్వరగా కోలుకోవాలని పట్టుకున్న పోస్టర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ...‘అర్జెంటీనా టీమ్ ఇలా చేస్తే బాగుండేది..’ అని రాసుకొచ్చింది.  ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

అయితే జియానిన్ని కామెంట్స్ పై అర్జెంటీనాకు చెందిన ఓ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. ఫిఫా ప్రపంచకప్ లో  అర్జెంటీనా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా  ప్రతీ మ్యాచ్ లో ఆట ఆరంభమైన పది నిమిషాల తర్వాత మారడోనా సేవలకు గుర్తుగా  పాటలు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. 

ఇదిలాఉండగా రౌండ్ ఆఫ్ 16 దశను దాటిన ఈ రెండు జట్లూ  క్వార్టర్స్ చేరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7న జరిగే తొలి క్వార్టర్స్ లో అర్జెంటీనా..  నెదర్లాండ్స్ ను ఢీకొడుతుంది.  ఇక 9న బ్రెజిల్.. క్రొయేషియాతో తాడో పేడో తేల్చుకోనుంది.  

 

సోమవారం  బ్రెజిల్  - సౌత్ కొరియా మధ్య జరిగిన మ్యాచ్ లో  మాజీ ఛాంపియన్లు అదిరిపోయే ఆటతో దక్షిణ కొరియాను  ఇంటికి పంపారు. బ్రెజిల్ తరఫున విని జూనియర్ ఆట 7వ నిమిషంలో తొలి గోల్ కొట్టాడు.  ఈ మ్యాచ్ కు ముందు గాయపడి  రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న బ్రెజిల్ స్టార్ నైమర్.. 13వ నిమిషంలో రెండో గోల్ చేశాడు.  రిచర్లీసన్ 29వ నిమిషంలో మూడో గోల్ కొట్టగా.. లుకాస్ పెక్వెటా నాలుగో గోల్ చేసి బ్రెజిల్ కు  తిరుగులేని ఆధిక్యం అందించారు.  దక్షిణకొరియా తరఫున  పైక్ సాంగ్ హూ.. ఆట 76వ నిమిషంలో గోల్ కొట్టాడు.  సెకండ్ హాఫ్ లో సౌత్ కొరియా దూకుడుగా ఆడినా బ్రెజిల్ మాత్రం గోల్స్ చేసే అవకాశమివ్వలేదు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios