సారాంశం

FA Cup Final 2023: యూకేలో అతి పురాతన లీగ్ అయిన   ఫుట్‌బాల్  అసోసియేషన్ ఛాలెంజ్ కప్ (ఎఫ్ఎ కప్) ఫైనల్ ఉత్కంఠగా ముగిసింది. ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా క్రికెటర్లు ఎగబడ్డారు. 

ఇంగ్లాండ్ వేదికగా  ప్రతి ఏడాది జరిగే  ఫుట్‌బాల్  అసోసియేషన్ ఛాలెంజ్ కప్ (ఎఫ్ఎ కప్) శనివారం రాత్రి లండన్‌లోని వెంబ్లీ  స్టేడియంలో ఘనంగా ముగిసింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే అత్యంత పురాతనమైన లీగ్‌గా గుర్తింపు పొంది. ఎఫ్ఎ కప్‌లో  నిన్న రాత్రి  మాంచెస్టర్ సిటీ వర్సెస్ మాంచెస్టర్ యూనైటెడ్ మధ్య ఫైనల్ జరిగింది.   తుది పోరులో మాంచెస్టర్ సిటీ.. 2-1 తేడాతో మాంచెస్టర్ యూనైటెడ్ పై గెలిచింది.     ఈ మ్యాచ్ చూసేందుకు గాను టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ,  శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు  మాజీ ఆల్ రౌండర్ యువరాజ్  సింగ్ కూడా హాజరయ్యాడు.  ఈ మ్యాచ్ ను కోహ్లీ, సూర్యలు తమ  సతీమణులతో కలిసి వీక్షించారు. 

మాంచెస్టర్ సిటీ  సారథి   గుండోగన్..  ఆట ఆరంభంలోనే  గోల్ కొట్టాడు.  మ్యాచ్ 12.91 వ నిమిషంలో తొలి గోల్ కొట్టి  తన టీమ్ కు ఆధిక్యం అందించాడు.   ఈ లీగ్ 33వ నిమిషం వరకూ కొనసాగింది.  33వ నిమిషంలో   మాంచెస్టర్ యూనైటెడ్  ఆటగాడు బ్రూనో ఫెర్నాండెజ్   గోల్ కొట్టి స్కోరును లెవల్ చేశాడు. 

ఫస్టాఫ్ ముగిసన తర్వాత ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా యత్నించాయి.    ఎట్టకేలకు మాంచెస్టర్ సిటీ తరఫున మరోసారి గుండోగన్.. 51వ నిమిషంలో గోల్ కొట్టి  ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు.  కానీ  యూనైటెడ్ మాత్రం  రెండో గోల్ కొట్టడంలో  సఫలం కాలేకపోయింది. దీంతో మాంచెస్టర్ సిటీకి   ఎఫ్ఎ కప్ ట్రోఫీ దక్కింది. 

 

1871 నుంచి  మొదలైన ఈ టోర్నీ ఇంగ్లాండ్ తో పాటు  క్రీడా రంగంలో అత్యంత పురాతనమైన లీగ్‌.  ఏడాదికోసారి జరిగే ఈ లీగ్ ఇప్పటికీ విజయవంతంగానే  సాగుతుండటం గమనార్హం. గతేడాది లివర్‌పూల్ జట్టు విజేతగా నిలవగా ఈసారి   ఆ అదృష్టం మాంచెస్టర్ సిటీని వరించింది.  2018 - 19 తర్వాత మాంచెస్టర్ సిటీ  ఎఫ్ఎ కప్ నెగ్గడం ఇదే ప్రథమం.  ఇక చివరిసారిగా  2015 - 16 లో ఎఫ్ఎ కప్ నెగ్గిన యూనైటెడ్.. 2017- 18 సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. ఈ ఏడాది కూడా ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకుంది.