Asianet News TeluguAsianet News Telugu

FIFA: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ.. మరోసారి తెరపైకి ఫేక్ మిస్టర్ బీన్..

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్  రెండో రోజు  సౌదీ అరేబియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. టోర్నీ ఫేవరేట్లుగా ఉన్న  అర్జెంటీనాను  సౌదీ అరేబియా ఓడించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫేక్ మిస్టర్ బీన్ తెరపైకి వచ్చాడు. 

Looks Like Argentina Sent Fake Mr. Bean: After Saudi Arabia  Beats Argentina, Netizens Trolls Messi's Team
Author
First Published Nov 23, 2022, 11:22 AM IST

ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  సూపర్ - 12 స్టేజ్ లో భాగంగా  జింబాబ్వే జట్టు పాకిస్తాన్ ను ఒక్క పరుగు తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో  పాకిస్తాన్ పై   జింబాబ్వే పగ కూడా తీర్చుకుంది. గతంలో తమ దేశానికి ఫేక్ బీన్ ను పంపినందుకు గాను  పాక్ కు ఇదే మేమిచ్చే గిఫ్ట్ అంటూ అప్పుడు   సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.  సాక్షాత్తు జింబాబ్వే, పాకిస్తాన్ ప్రధానులు కూడా ఈ ఫేక్ బీన్ గురించి సోషల్ మీడియా వేదికగా  ట్వీట్లు చేసుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  ఇక ఇప్పుడు కూడా ఈ ఫేక్ మిస్టర్ బీన్ మరోసారి  తెరపైకి వచ్చాడు. 

ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ప్రపంచకప్ లో మంగళవారం  సౌదీ అరేబియా.. 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించిన విషయం  విదితమే. ఈ ఓటమి తర్వాత నెటిజన్లు అర్జెంటీనాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నెటిజనులు..  అర్జెంటీనా కూడా సౌదీకి ఫేక్ మిస్టర్ బీన్ ను పంపించి ఉండొచ్చని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

అర్జెంటీనా ఓడిన తర్వాత.. ‘బహుశా  అర్జెంటీనా కూడా గతంలో సౌదీ అరేబియాకు ఫేక్ మిస్టర్ బీన్ ను పంపి ఉంటుంది. అందుకే వాళ్లు అర్జెంటీనాపై కసితో ఆడారు.  వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు..’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్, ట్రోల్స్  ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. 

 

ఇక మంగళవారం నాటి మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ ప్రారంభమయ్యాక  9వ నిమిషంలోనే  అర్జెంటీనా తొలి గోల్ కొట్టింది.  ఆ జట్టు దిగ్గజం మెస్సీ.. పెనాల్టీ కిక్ ను  గోల్ గా మలిచి  అర్జెంటీనాకు ఆధిక్యం ఇచ్చాడు.  తొలి అర్థభాగం  అంతా  అర్జెంటీనా  హవానే నడిచింది.  కానీ  ఆట  సెకండ్ హాఫ్ లో సౌదీ అరేబియా  పోరాడింది. రెండో  హాఫ్ మొదలయ్యాక  ఆట 47వ నిమిషంలో అల్ షెహ్రీ  గోల్ కొట్టాడు.  దీంతో సౌదీ  1-1తో సమం చేసింది.  

 

 

గోల్ కొట్టిన ఊపుమీద ఉన్న సౌదీకి   సలీమ్ అల్ దవాసరి  మరో బ్రేక్ ఇచ్చాడు. ఆట 57వ  నిమిషంలో  అర్జెంటీనా డిఫెన్స్ ను ఛేదించుకుంటూ వెళ్లి  గోల్ చేశాడు. దీంతో  సౌదీ ఆధిక్యం  2-1 కు దూసుకెళ్లింది.   చివర్లో  అర్జెంటీనా   సౌదీ గోల్ పోస్ట్ ను టార్గెట్ గా చేసుకున్నా   ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం  ఆ అవకాశమివ్వలేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios