FIFA: మెస్సీ మ్యాజిక్.. క్రొయేషియాను చిత్తు చేసి ఫైనల్ చేరిన అర్జెంటీనా

FIFA World Cup 2022:  ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఫైనల్ చేరింది.  గత  టోర్నీ రన్నరప్ క్రొయేషియాను చిత్తు చేస్తూ తుది సమరానికి సిద్ధమైంది.  అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ  ప్రపంచకప్ కలకు ఆ జట్టు అడగుదూరంలో నిలిచింది. 
 

Lionel Messi Led Argentina  Beats Croatia by 3-0, Enters in FIFA WC 2022 Finals

2018 లో  రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ లో క్రొయేషియా చేతిలో ఎదురైన పరాభవానికి అర్జెంటీనా బదులుతీర్చుకుంది. ఖతర్ లో  ఆ జట్టుకు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా భారీ షాక్ ఇచ్చింది.  మంగళవారం అర్థరాత్రి జరిగిన  ఫిఫా తొలి సెమీస్ లో  అర్జెంటీనా  3-0 తేడాతో క్రొయేషియాను ఓడించి ఫైనల్స్ కు అర్హత సాధించింది.   మెస్సీ స్వయంగా ఓ గోల్ కొట్టడమే గాక  మరో గోల్  కొట్టడంలో కీలక పాత్ర పోషించి  ఆ జట్టును ఫైనల్ చేర్చాడు.   2014 తర్వాత అర్జెంటీనా మళ్లీ ఫైనల్ చేరింది. 

ఈ మ్యాచ్ లో  తొలి అర్థభాగంలో  అర్జెంటీనా రెండు గోల్స్ కొట్టింది.  పెనాల్టీ  కిక్ ద్వారా  ఆట 34వ నిమిషంలో మెస్సీ గోల్ కొట్టాడు.   ఆ తర్వాత  అల్వారెజ్ ఆట 38వ నిమిషంలో అద్భుత గోల్ చేశాడు. ఫస్టాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.  

సెకండాఫ్ లో కూడా అర్జెంటీనా క్రొయేషియా గోల్ పోస్ట్  ను లక్ష్యంగా చేసుకుని ఆడింది. పలుమార్లు గోల్ చేయడానికి యత్నించినా  క్రొయేషియా ఆటగాళ్లు, గోల్ కీపర్ సమర్థవంతంగా  అడ్డుకున్నారు. కానీ  ఆట 69వ నిమిషయంలో  మెస్సీ, అల్వారెజ్ లు అద్భుత సమన్వయంతో గోల్ కొట్టారు. అర్జెంటీనా  గోల్ పోస్ట్ సమీపం నుంచి బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంటూ వచ్చిన మెస్సీ  క్రొయేషియా  గోల్ పోస్ట్  వరకూ వచ్చి దానిని అల్వారెజ్ కు అందజేశాడు. దాంతో అతడు చాకచక్యంతో స్పందించి గోల్ కొట్టేశాడు.  ఆ తర్వాత  క్రొయేషియా  గోల్ కోసం తపించినా అర్జెంటీనా ఆ అవకాశమివ్వలేదు. 

 

ఈ విజయంతో అర్జెంటీనా ఫైనల్ కు చేరింది.   1978, 1986 లో  ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచినా ఆ జట్టు 2014లో  ఫైనల్ చేరినా గెలవలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా ఆ దిశగా మరో అడుగు వేస్తే మెస్సీ కల నెరవేరినట్టే.. నేడు ఫ్రాన్స్ - మొరాకో మధ్య జరుగబోయే రెండో సెమీస్ లో గెలిచిన విజేతతో  అర్జెంటీనా ఫైనల్ లో తలపడుతుంది. ఫైనల్ ఈనెల 18న జరగాల్సి ఉంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios