Lionel Messi: 36 ఏండ్ల తర్వాత తమ దేశాన్ని జగజ్జేతగా నిలిపిన  మెస్సీ అండ్ కో. కు  అర్జెంటీనా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫిఫా ప్రపంచకప్ గెలుచుకున్న తర్వాత  అర్జెంటీనా రాజధానికి చేరుకున్న  ఫుట్‌బాల్ టీమ్ కు ఘన స్వాగతం లభించింది. 

మూడున్నర దశాబ్దాల తర్వాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన అర్జెంటీనా జాతీయ జట్టు సోమవారం రాత్రి స్వదేశానికి చేరుకుంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు.. ప్రత్యేక విమానంలో రాజధాని బ్యూనోస్ ఎయిర్స్‌కు చేరింది. మెస్సీ అండ్ కో. విమానం నుంచి దిగగానే అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలు తమ అభిమాన ఆటగాళ్ల రాకను చూసి సంబురాలు చేసుకున్నారు. విమానం నుంచి నేరుగా ప్రత్యేకమైన బస్సు ఎక్కిన ఆటగాళ్లు బ్యూనోస్ ఎయిర్స్‌ వీధుల్లోకి ఫిఫా ట్రోఫీని ప్రదర్శించారు.

ఫుట్‌బాల్ ను అమితంగా ఇష్టపడే అర్జెంటీనాలో ఫైనల్ జరిగిన రోజు బ్యూనోస్ ఎయిర్స్ లోని ప్రఖ్యాత చరిత్రాత్మక కట్టడం ఒబెస్లిక్ లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఒబెస్లిక్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లలో మ్యాచ్ ను తిలకించిన అభిమానులు.. సోమవారం కూడా అక్కడికి వేలాదిగా చేరుకున్నారు. 

ఇక వరల్డ్ కప్ ట్రోఫీతో బ్యూనోస్ ఎయిర్స్‌ వీధుల్లోకి వచ్చిన మెస్సీ బృందం.. ఓపెన్ టాప్ బస్సులో ఫిఫా ట్రోఫీతో రోడ్ షో చేసింది. వీధుల్లో తమను చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అర్జెంటీనా ఫిఫా ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో అక్కడ మంగళవారం ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించింది ప్రభుత్వం. నేడు అక్కడ మెస్సీ బృందానికి ప్రత్యేక సన్మానం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యే అవకాశముంది.

Scroll to load tweet…

Scroll to load tweet…

మెస్సీ బృందాన్ని చూడటానికి వచ్చిన అభిమానులు.. ‘మేం రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. రేపు కూడా ఇక్కడే ఉంటాం. ఫిఫా వేడుకలను ఘనంగా పూర్తిచేసుకునే వెళ్తాం..’ అని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ బృందం రోడ్ షో, వేలాదిగా అభిమానులు వీధుల్లోకి రావడంతో బ్యూనోస్ ఎయిర్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Scroll to load tweet…