ఫోటో జీవితాన్ని మలుపు తిప్పింది: కశ్మీర్ యువతి విజయగాథ
ఆషిక్.. 2017 డిసెంబర్‌లో ఈమె రాళ్ల దాడికి పాల్పడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ ఫోటోనే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ముఖం కనబడకుండా స్కార్ఫ్ కట్టుకోవడంతో తనను ఎవరు గుర్తు పట్టరని ఆఫ్షాన్ భావించింది. కానీ ఆ తర్వాత క్షణాల్లో ఆమె గురించి ప్రపంచానికి తెలిసిపోయింది.
కశ్మీర్‌లో భద్రతా దళాలపైకి స్థానిక యువత రాళ్ల దాడికి పాల్పడటం మనం ఎన్నో సార్లు టీవీలు, న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం. సీసీ కెమెరాల ఆధారంగా ఆ తర్వాత పోలీసులు వారిని విచారించడం అక్కడ ప్రతినిత్యం జరిగేది.
అలా ఎంతోమంది యువత స్టోన్ పెల్టర్‌గా పిలిపించుకుంటూ సమాజం చేతిలో చిన్నచూపుగా గురవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఆఫ్షాన్ ఆషిక్.. 2017 డిసెంబర్‌లో ఈమె రాళ్ల దాడికి పాల్పడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఆ ఫోటోనే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ముఖం కనబడకుండా స్కార్ఫ్ కట్టుకోవడంతో తనను ఎవరు గుర్తు పట్టరని ఆఫ్షాన్ భావించింది. కానీ ఆ తర్వాత క్షణాల్లో ఆమె గురించి ప్రపంచానికి తెలిసిపోయింది.
వెంటనే స్టోన్ పెల్టర్‌గా ముద్ర వేసింది. దీని నుంచి బయటపడేందుకు ఆమె పెద్ద పోరాటమే చేస్తోంది. తాను స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా మాత్రమే రాళ్లు రువ్వానని సైన్యానికి వ్యతిరేకంగా కాదని ఆఫ్షాన్ తెలిపింది.
పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారని.. తమ విద్యార్ధులను కొట్టారని.. ఈ పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి రాళ్లు విసరడం తప్పించి మరో మార్గం లేదని.. తానేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదని.. తన మీద పడిన ఈ ముద్రను తొలగించాలని ఆఫ్షాన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది.
ఈ ఘటన తర్వాత ఆమె నెల రోజుల పాటు ఇంటికే పరిమితమైపోయింది. ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటకు దూరమైంది.. అరగంట పాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లిని ప్రాధేయపడినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఒక రోజు భోజనం చేస్తుండగా ఏడుస్తున్న ఆఫ్షాన్‌ను చూసి ఆమె తండ్రి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు. ఇంట్లో కూర్చొని ఇంతకంటే ఏం చేయను అనే సరికి.. బయటకు వెళ్లడానికి ఆమె తండ్రి అనుమతినిచ్చారు.
ఈ ఘటన తర్వాత తనను ఎవరు గుర్తు పట్టరని శిక్షణకు వెళ్లింది ఆఫ్షాన్.. అయితే రాష్ట్ర క్రీడల శాఖ కార్యదర్శి ఆమె దగ్గరికి వచ్చి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయావ్ అని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన ఆమె తాను ఏం చేశానని ప్రశ్నించింది. నీకు అండగా ఉంటానని.. అసలేం జరిగిందో మీడియాతో చెప్పమని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఆషిక్ తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటలో రాటు దేలింది.. ముంబైలో శిక్షణ తీసుకుని... ప్రస్తుతం ఇండియన్ మహిళల లీగ్‌లో కొల్హాపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది జమ్మూకశ్మీర్ జట్టుకు తరపున ఆడిన ఆఫ్షాన్.. కోచ్ సూచనల మేరకు కొల్హాపూర్ టీమ్‌లో చేరింది.
ముంబై రావడానికి ముందు శ్రీనగర్‌లో ఫుట్ బాల్ కోచ్‌గా వ్యవహరించింది. స్వంతంగా ఒక స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది బాలికలకు ఆటలో మెళుకువలు నేర్పించింది.
స్ధానిక ఫుట్‌బాల్ అసోసియేషన్ గ్రౌండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆషిక్ పెద్ద పోరాటం చేసింది. చివరికి దిగి వచ్చిన ప్రభుత్వం ఆమెకు కావాల్సిన ఫుట్‌బాల్ మైదానాన్ని అప్పగించింది.
ఫుట్‌బాలర్‌గా మారిన తనను స్టోన్ పెల్టర్ అంటే ఆషిక్ అస్సలు ఒప్పుకోదు.. ఫుట్ బాల్ క్రీడాకారిణిగానే తనను గుర్తించాలని ఆరాటపడుతోంది.. ఏదో ఒక రోజు ఫుట్ బాల్ క్రీడాకారిణిగానే తనను అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆఫ్షాన్ ధీమా వ్యక్తం చేసింది.