ISL 2020: హైదరాబాద్ ఎఫ్‌సీ హ్యాట్రిక్... వరుసగా మూడో ఓటమి... గోవా ఎఫ్‌సీకి విజయం..
గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో హైదరాబాద్ ఓటమి...
వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్ ఎఫ్‌సీ...
వరుస విజయాలతో టాప్ 3లోకి దూసుకొచ్చిన గోవా ఎఫ్‌సీ...
ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ హ్యాట్రిక్ కొట్టింది. అయితే విజయాల్లో కాదు, పరాజయాల్లో! వరుసగా మూడో మ్యాచ్ ఓడిన హైదరాబాద్, ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో పరాజయం పాలైంది హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్.
ఆట ప్రారంభమైన 58వ నిమిషంలో గోల్ చేసిన హైదరాబాద్ ప్లేయర్ అరిడానే సాంటానా... ఆధిక్యాన్ని అందించాడు. ఆధిక్యం రావడంతో గోల్ చేసేందుకు అవకాశాలు వచ్చినా, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు హైదరాబాద్ ప్లేయర్లు.
ఆట 87వ నిమిషంలో తొలి గోల్ చేసిన గోవా ఎఫ్‌సీ ప్లేయర్ పండితా, స్కోరును సమం చేశాడు. అయితే ఆట 90వ నిమిషంలో ఇగోర్ అంగులో గోల్ చేయడంతో గోవా ఎఫ్‌సీ అద్భుత విజయాన్ని అందుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్, 8వ స్థానంలో ఉండగా గోవా టాప్ 3లోకి ఎగబాకింది.