ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో ఓడిశా ఎఫ్‌సీ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించిన ఓడిశా.. సీజన్‌లో ఆడిన 9వ మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. 

ఆట ప్రారంభమైన 7వ నిమిషంలో గోల్ చేసిన జోర్డాన్ ముర్రే, కేరళ బ్లాస్టర్స్‌కి ఆధిక్యాన్ని అందించాడు. అయితే కేరళ ప్లేయర్ల జీక్సన్ సింగ్ 22వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేసి ఓడిశాకు తొలి గోల్ అందించాడు. 42వ నిమిషంలో ఓడిశా ఎఫ్‌సీ ప్లేయర్ స్టీవెన్ టేలర్ గోల్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లింది ఓడిశా.

ఆ తర్వాత డిగో మారిసియా ఏకంగా రెండు వరుస గోల్ చేసి, కేరళ బ్లాస్టర్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 4-1 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది ఓడిశా. ఆ తర్వాత 79వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ గ్యారీ హుపర్ గోల్ చేసినా 4-2 తేడాతో విజయాన్ని అందుకుంది ఓడిశా.

తొలి విజయం అందుకున్నప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే కొనసాగుతోంది ఓడిశా. ఐదు మ్యాచుల్లో ఓడిన కేరళ బ్లాస్టర్స్ 10వ స్థానంలో ఉంది.