ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ స్ట్రైకర్ వచ్చేస్తున్నాడు..! అదే జరిగితే అర్జెంటీనాకు కష్టమే
FIFA World Cup 2022: టీమ్ తో పాటు ఖతర్ కు వచ్చిన బెంజెమా.. ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. తొడ గాయంతో అతడు జట్టును వీడాల్సి వచ్చింది. దీంతో తన ప్లేస్ ను మరొకరికి వదిలేసి వెళ్తున్నందుకు అతడు తీవ్ర నిరాశచెందాడు.
కీలక ఫైనల్ కు ముందు ఫ్రాన్స్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు స్టార్ స్ట్రైకర్ కరీం బెంజెమా తిరిగి జట్టుతో చేరనున్నట్టు సమాచారం. పిఫ్రా ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డ బెంజెమా.. ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. వరల్డ్ కప్ కు దూరమవడంతో బెంజెమా.. మాడ్రిడ్ కు వెళ్లి అక్కడ తన ఫిట్నెస్ మీద దృష్టి సారించాడు. అక్కడే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన బెంజెమా.. అర్జెంటీనాతో కీలక ఫైనల్ లో ఫ్రాన్స్ తరఫున బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది.
అయితే ఇదే విషయమై ఫ్రాన్స్ హెడ్ కోచ్ డెస్చాంప్స్ మాత్రం స్పష్టత లేని సమాధానం ఇవ్వడం గమనార్హం. మొరాకోతో మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫ్రాన్స్ హెడ్ కోచ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రశ్నకు నేను నిజంగా సమాధానం చెప్పదలుచుకోలేదు..’ అని కాసేపు గ్యాప్ తీసుకుని ‘తర్వాత ప్రశ్న అడగండి.. సారీ..’ అని చెప్పాడు.
టీమ్ తో పాటు ఖతర్ కు వచ్చిన బెంజెమా.. ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. తొడ గాయంతో అతడు జట్టును వీడాల్సి వచ్చింది. దీంతో తన ప్లేస్ ను మరొకరికి వదిలేసి వెళ్తున్నందుకు అతడు తీవ్ర నిరాశచెందాడు.
మాడ్రిడ్ కు వెళ్లిన బెంజెమా గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించాడు. ఫిట్నెస్ పై దృష్టిపెట్టి ఆట మీదే ఫోకస్ పెట్టాడు. ఈ మేరకు రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా అతడు ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్విటర్ లో పంచుకున్నది. ఇక బెంజెమా తిరిగి జట్టుతో చేరితే అది ఫ్రాన్స్ కు మరింత బలం చేకూర్చేదే. ప్రస్తుతమున్న ఫుట్‌బాల్ ప్లేయర్లలో వయసు మీదపడ్డా గోల్స్ కొట్టగల సమర్థత బెంజెమాకు ఉన్నది.
ఆల్ టైం బెస్ట్ స్ట్రైకర్స్‌లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కరీం బెంజెమా, ఇప్పటిదాకా 23 ఫుట్‌బాల్ టైటిల్స్ గెలిచాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా ఉన్నాడు బెంజెమా. ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచ్ లు ఆడి 37 గోల్స్ చేశాడు.
2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు కరీం బెంజెమా. రష్యాలో జరిగిన 2018 ఫిఫా వరల్డ్ కప్ టైటిల్‌ని ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో క్రోయేషియాను 4-2 తేడాతో ఓడించి రెండో టైటిల్ గెలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో కరీం బెంజెమాకి చోటు దక్కలేదు. ఇక ఈ టోర్నీ ప్రారంభానికి ముందు గాయపడటం అతడి ప్రపంచకప్ కలలను చిదిమేసింది. మరి అర్జెంటీనాతో మ్యాచ్ వరకైనా బెంజెమా ఆడతాడా..? లేక ఫ్రాన్స్ అతడిని పక్కనబెడుతుందా.?? అన్నది ఆసక్తికరంగా మారింది.