FIFA: వేషాలేస్తే జైళ్లో వేస్తాం.. కుటుంబాలకు నరకయాతన తప్పదు.. ఆటగాళ్లకు ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు..!
FIFA World Cup 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన ఇతర జట్లకు తమ స్వంత దేశం నుంచి ఎటువంటి మద్ధతు ఉందో లేదో గానీ ఇరాన్ జాతీయ జట్టుకు మాత్రం స్వంత ప్రభుత్వం నుంచే బెదిరింపులు ఎదురవుతున్నాయి.
ప్రపంచకప్ ఆడేందుకు ఖతర్‌కు వచ్చిన ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేశానికి ఆడుతున్నారనే కనికరం కూడా లేకుండా అందరినీ తీసుకెళ్లి జైళ్లల్లో పడేస్తామని, కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించింది. గెలిచినా ఓడినా నోరు మూసుకుని ఉంటేనే మంచిదని.. కథలు పడితే కటకటాలు తప్పవని ఆదేశించినట్టు
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చారు. ఇరాన్ ప్లేయర్స్ చేసిన ఈ నిరసనతో ఇన్నాళ్లు అక్కడికే పరిమితమైన ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ పై అంతర్జాతీయ సమాజం తీవ్ర విమర్శలకు దిగుతున్నది.
ఈ మ్యాచ్ అనంతరం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్సీజీ) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్‌బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు తెలుస్తున్నది.
మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే అలా చేసినవారికి జైలు శిక్ష తప్పదని, అలాగే వారి కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బెదిరింపులతోనే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది.ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్సీజీ ప్రతినిధులు ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఇరాన్ నిరసన తెలిపిన తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో ఐఆర్సీజీకి చెందిన గార్డ్స్ ప్రేక్షకుల్లో కలిసిపోయి మ్యాచ్ ను వీక్షించినట్టు తెలుస్తున్నది. ఆటగాళ్లు ఎవరైనా ‘గీత దాటితే’వారిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని.. యూఎస్ఏతో మ్యాచ్ లో కూడా వాళ్లు వస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే అందరికీ మంచిదని సున్నితంగా మందలించినట్టు పలు అంతర్జాతీయ వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి.