సారాంశం

Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ జట్టు సారథి   సునీల్ ఛెత్రి తండ్రి కాబోతున్నాడు.  ఈ విషయాన్ని అతడు కాస్త డిఫరెంట్‌గా చెప్పాడు. 

భారత ఫుట్‌బాల్   జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఛెత్రి  తనదైన శైలిలో, తన ఆటకు సంబంధించిన  వస్తువును ఉపయోగించి చెప్పడం గమనార్హం.  హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా  భారత జట్టు సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో  1-0 తేడాతో   వనుతూను ఓడించింది.    ఈ గోల్ కొట్టిన ఛెత్రి..  ఫుట్‌బాల్‌ను  తన టీషర్ట్ లోపల ఉంచి భార్య గర్భవతి అన్న విషయాన్ని ప్రపంచానికి   చెప్పాడు.   

ఈ మ్యాచ్‌లో ఛెత్రి ..  81వ నిమిషంలో  గోల్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు.   ఈ కమ్రంలో అతడు.. బంతిని తీసుకుని పక్కగా వచ్చి  టీషర్ట్ లోపల ఉంచి తన భార్యను చూస్తూ  ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాడు. ఛెత్రి చేసిన ఈ పని ముందు ఎవరికీ అర్థం కాలేదు. 

కానీ మ్యాచ్ ముగిశాక ఛెత్రి  ఇలా ఎందుకు చేశాడో వెల్లడించాడు.  ‘నేను, నా భార్య  త్వరలోనే  తల్లిదండ్రులం కాబోతున్నాం.  ఈ విషయాన్ని నేను ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనుకున్నా. ఈ మేరకు కొన్ని ఐడియాలను కూడా అనుకున్నా.  గతంలో ఫుట్‌బాల్  క్రీడాకారులు తాము   తండ్రి అవబోతున్నామనే విషయాన్ని ఇలాగే చెప్పేవారు.  నేను కూడా అదే ఫాలో అయ్యా. ఈ విషయాన్ని నేను ముందుగానే నా భార్యకు చెప్పా. వనుతూతో మ్యాచ్ లో గోల్ కొడితే  నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రపంచానికి చెప్తా అని  ఆమెకు చెప్పా. అదీగాక జూన్ 11న తమ రిలేషన్‌షిప్ యానివర్సరీ కూడా ఉంది. ఈ సందర్భంగా మాకు  శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు..’అని తెలిపాడు. 

 

కాగా  ఛెత్రి..  2017లో  మోహన్ బగాన్ లెజెండ్ సుబ్రతో భట్టాచార్య కూతురు  సోనమ్ భట్టాచార్యను   పెళ్లి చేసుకున్నాడు. డిసెంబర్ 3న వీరి వివాహం కోల్కతాలో ఘనంగా జరిగింది. సోనమ్.. స్కాట్లాండ్ లో బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ చేసి వ్యాపార రంగంలో స్థిరపడింది. కోల్కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలో ఆమె  రెండు హోటల్స్ ను నిర్వహిస్తోంది.