FIFA: బ్రెజిల్ వరల్డ్ కప్ ఆశలు గల్లంతు.. రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో నెమార్
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న బ్రెజిల్ కు మరోసారి రిక్తహస్తాలే మిగిలాయి. క్వార్టర్స్ లో భాగంగా ఆ జట్టు.. క్రొయేషియాతో ముగిసిన మ్యాచ్ లో షూట్ అవుట్ లో ఓడింది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన బ్రెజిల్ కు ఈసారి కూడా షాక్ తప్పలేదు. చివరిసారిగా 2002లో వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టు.. అప్పట్నుంచి ప్రతీ ప్రపంచకప్ లోనూ పాల్గొనడం, క్వార్టర్స్ లోనే పోరాటం చాలించడం ఆనవాయితీగా వస్తోంది. 2006, 2010, 2018 టోర్నీలలో ఆ జట్టు క్వార్టర్స్ లోనే ఓడగా 2014 లో మాత్రం సెమీస్ వరకు వెళ్లగలిగింది. తాజాగా ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మీద బ్రెజిల్ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ క్రొయేషియా ఆ జట్టుకు షాకిచ్చింది. ఈ ఓటమి తర్వాత బ్రెజిల్ కు మరో షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు స్టార్ ఆటగాడు నెమార్ రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నాడు.
క్రొయేషియాతో మ్యాచ్ లో నెమార్ ఓ గోల్ కొట్టాడు. కానీ మ్యాచ్ ఓడాక అతడు మాట్లాడిన మాటలు వింటే అసలు నెమార్ తిరిగి జాతీయ జట్టుకు ఆడటం కష్టమేనని అర్థమవుతుంది. తాను తిరిగి ఆడేది అనుమానమే అని నెమార్ కుండబద్దలుకొట్టాడు.
గాయాలతో సతమతమవుతున్న నెమార్ జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్రొయేషియాతో మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘నిజంగా నాక్కూడా దాని గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదేమో. ఈ సమయం (ఓటమిలో ఉండగా) లో నేను సరిగా ఆలోచించడం లేదు. ఈ ఓటమి అయితే నన్ను తీవ్రంగా కలిచివేసింది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం..
నేను దాని గురించి ఆలోచించాలి. నేను ఏం చేయాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా. బ్రెజిల్ తరఫున ఆడను అని అయితే చెప్పను. కానీ తిరిగి దేశం తరఫున ఆడతానని కూడా వంద శాతం చెప్పలేపోతున్నా..’ అని వ్యాఖ్యానించాడు.
నెమార్ కు ఇప్పుడు 30 ఏండ్లు. మరో ప్రపంచకప్ వరకు ఆడినా అతడి వయసు 34 ఏండ్లే. ఇదేం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం ప్రపంచకప్ ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో కు 37 ఏండ్లు కాగా మెస్సీకి 35 ఏండ్లు. తమ దేశానికి వరల్డ్ కప్ అందించడానికి వాళ్లు కెరీర్ చరమాంకంలో కూడా పోరాడుతున్నారు. నెమార్ కు ఇంకా వయసు, ఆడగలిగే సామర్థ్యం కూడా ఉంది. మరి నెమార్ ఏ నిర్ణయం తీసుకుంటాడో..?
క్వార్టర్స్ పోరులో క్రొయేషియాతో మ్యాచ్ లో నిర్ణీత ఆట సమయంలో 1-1తో మిగలడంతో పెనాల్టీ షూట్ అవుట్ కు వెళ్లక తప్పలేదు. షూట్ అవుట్ లో బ్రెజిల్ రెండు గోల్స్ మాత్రమే చేయగా క్రొయేషియా నాలుగు గోల్స్ తో అదరగొట్టి సెమీస్ చేరింది. బ్రెజిల్ ఆటగాడు మార్కినోస్ పెనాల్టీ తీసుకుని గోల్ కొట్టేందుకు యత్నించి విఫలమైన క్షణంలో నెమార్ కన్నీటిపర్యంతమయ్యాడు.