FIFA: 32 దేశాలు ఆడితే అర్జెంటీనా, ఫ్రాన్స్ మిగిలాయి.. ఫైనల్ పోరుకు ఇక్కడిదాకా ఎలా చేరాయంటే..!
FIFA World Cup 2022: అరబ్బుల దేశం ఖతర్ లో సుమారు నెల రోజులుగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ తుది దశకు చేరింది. సెమీఫైనల్స్ ముగియడంతో ఇక మిగిలింది ఫైనల్ మాత్రమే. నవంబర్ 20న మొదలైన ఈ టోర్నీలో డిసెంబర్ 18న ఫైనల్ జరుగనుంది.
సుమారు నెల రోజులుగా ప్రపంచ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను విశేషంగా అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్‌లో తుది దశకు చేరుకున్నది. బుధవారం, గురువారం జరిగిన రెండు సెమీస్ లలో విజేతలు వచ్చే ఆదివారం ఫైనల్ లో తాడో పేడో తేల్చుకోనున్నారు. సెమీస్ లో అర్జెంటీనా.. క్రొయేషియాను ఓడించగా డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్.. ఆఫ్రికన్ టీమ్ మొరాకోను మట్టికరిపించి ఫైనల్ చేరాయి. 32 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో అర్జెంటీనా, ఫ్రాన్స్ లు ఫైనల్ కు ఎలా చేరాయో ఇక్కడ చూద్దాం.
ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సారథ్యం వహిస్తున్న అర్జెంటీనా.. ఈసారి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తన కెరీర్ లో చివరి ప్రపంచకప్ (ఇప్పటికే ప్రకటించాడు) ఆడుతున్న మెస్సీ ఖతర్ లో తాడో పేడో తేల్చుకునేందుకు వచ్చాడు. అందుకు అనుగుణంగానే అర్జెంటీనా ప్రయాణం సాగింది.
లీగ్ దశలో భాగంగా అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓడింది. సౌదీ రెండు గోల్స్ చేయగా అర్జెంటీనా ఒక్క గోల్ కే పరిమితమవడంతో మెస్సీ అండ్ కో కు షాక్ తప్పలేదు. కానీ ఈ ఓటమి అర్జెంటీనా ప్రయాణాన్ని మార్చింది. చిన్న జట్లను తక్కువగా అంచనా వేయకూడదని తెలిసొచ్చింది. తర్వాత పుంజుకున్న అర్జెంటీనా లీగ్ దశలో తర్వాత రెండు మ్యాచ్ లను నెగ్గింది. మెక్సికో, పోలండ్ పై విజయాలు సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ స్టేజ్ లో మెస్సీ బృందం.. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఇంటికి పంపి క్వార్టర్స్ కు చేరింది.
నెదర్లాండ్ పై నెగ్గి సెమీస్‌కు..
క్వార్టర్స్ లో నెదర్లాండ్ తో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు రెండేసి గోల్స్ తో సమానంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది. అయితే అర్జెంటీనా 4 గోల్స్ చేయగా నెదర్లాండ్స్ మూడు మాత్రమే చేసింది. ఇక సెమీస్ లో గత టోర్నీ రన్నరప్స్ క్రొయేషియాను 3-0తో ఓడించి ఫైనల్ కు చేరింది.
ఫ్రాన్స్ కథ ఇది..
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఈ టోర్నీలో ట్యూనిషియా చేతిలో మాత్రమే ఓడింది. తమ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను (4-1) చిత్తుగా ఓడించిన ఫ్రాన్స్, తర్వాత డెన్మార్క్ ను చిత్తు చేసింది. కానీ లీగ్ లో చివరిమ్యాచ్ లో ట్యూనిషియా చేతిలో ఓడింది. రౌండ్ ఆఫ్ 16లో పోలండ్ ను ఓడించిన ఎంబబె బృందం.. క్వార్టర్స్ లో ఇంగ్లాండ్ ను ఓడించింది.
సంచలన విజయాలతో సెమీఫైనల్ చేరిన మొరాకోతో ఫ్రాన్స్ దూకుడుగా ఆడింది. ఫిఫా ప్రపంచకప్ లో తొలి సెమీస్ ఆడుతున్న మొరాకో ను డిఫెన్స్ లోకి నెట్టి అద్భుత విజయాన్ని అందుకుని ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
మూడో టైటిల్ కోసం రెండు జట్ల తహతహ..
- ఫ్రాన్స్, అర్జెంటీనాలు ఇదివరకే రెండు సార్లు విశ్వవిజేతలుగా నిలిచాయి. 1978, 1986లో అర్జెంటీనా ఫిఫా విజేతగా నిలవగా 1998, 2018లలో ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. ఈ రెండు జట్లకూ ఇది నాలుగో ప్రపంచకప్ ఫైనల్ కావడం గమనార్హం.
- ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ లో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. 1930, 1978లలో అర్జెంటీనా ఫ్రాన్స్ ను ఓడించగా 2018లో రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్.. మెస్సీ అండ్ కో కు షాక్ ఇచ్చింది. మరి ఆదివారం విజేత ఎవరు కానున్నారో...? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.