FIFA: మెస్సీ మెరిసినా అర్జెంటీనాకు అదృష్టం లేదు.. టోర్నీ ఫేవరేట్లకు షాకిచ్చిన సౌదీ అరేబియా

FIFA World Cup 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది.   టోర్నీ ఫేవరేట్లలో ఒకరిగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చింది. 

FIFA World Cup 2022: Saudi Arabia Shocks Argentina, Beat Lionel Messi's Team by 2-1

అరబ్బుల దేశం ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో  ఎవరూ ఊహించిన ఫలితం. టోర్నీ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన  అర్జెంటీనా  కలలో కూడా ఊహించని ఫలితం నమోదైంది.  ప్రపంచ 51వ ర్యాంకర్ గా ఉన్న సౌదీ అరేబియా.. అర్జెంటీనాకు దిమ్మ తిరిగే షాకిచ్చింది.  ఖతర్ లోని  లుసాలీ స్టేడియం వేదికగా కొద్దిసేపటి క్రితం ముగిసిన  మ్యాచ్ లో సౌదీ అరేబియా.. 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించి  సంచలన విజయన్ని అందుకుంది. అర్జెంటీనాపై సౌదీకి ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు నాలుగు సార్లు పోటీపడినా రెండుసార్లు అర్జెంటీనా గెలవగా రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి.ఇక అర్జెంటీనా  స్ట్రైకర్ లియోనల్ మెస్సీ మెరిసినా ఆ జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. 

గ్రూప్ -సీలో భాగంగా ఉన్న ఇరుజట్లు టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడాయి.   ఈ మ్యాచ్ కు ముందు అర్జెంటీనా..  2019 నుంచి  నేటి మ్యాచ్ వరకూ  వరుసగా 36 మ్యాచ్ లలో గెలుస్తూ వచ్చింది.   మరో మ్యాచ్ గెలిస్తే వాళ్లు ఇటలీ (37 వరుస విజయాలు) రికార్డును సమం చేసేవాళ్లు. కానీ   సౌదీ మాత్రం అర్జెంటీనాకు ఊహించని షాకిచ్చింది. 

మ్యాచ్ ప్రారంభమయ్యాక  9వ నిమిషంలోనే  అర్జెంటీనా తొలి గోల్ కొట్టింది.  ఆ జట్టు దిగ్గజం మెస్సీ.. పెనాల్టీ కిక్ ను  గోల్ గా మలిచి  అర్జెంటీనాకు ఆధిక్యం ఇచ్చాడు.  తొలి అర్థభాగం  అంతా  అర్జెంటీనా  హవానే నడిచింది.  

కానీ  ఆట  సెకండ్ హాఫ్ లో సౌదీ అరేబియా  పోరాడింది. రెండో  హాఫ్ మొదలయ్యాక  ఆట 47వ నిమిషంలో అల్ షెహ్రీ  గోల్ కొట్టాడు.  దీంతో సౌదీ  1-1తో సమం చేసింది.   గోల్ కొట్టిన ఊపుమీద ఉన్న సౌదీకి   సలీమ్ అల్ దవాసరి  మరో బ్రేక్ ఇచ్చాడు. ఆట 57వ  నిమిషంలో  అర్జెంటీనా డిఫెన్స్ ను ఛేదించుకుంటూ వెళ్లి  గోల్ చేశాడు.  దీంతో  సౌదీ ఆధిక్యం  2-1 కు దూసుకెళ్లింది.   చివర్లో  అర్జెంటీనా   సౌదీ గోల్ పోస్ట్ ను టార్గెట్ గా చేసుకున్నా   ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం  ఆ అవకాశమివ్వలేదు. ఈ టోర్నీలో అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్ ను  ఆదివారం మెక్సికోతో ఆడాల్సి ఉంది.  

 

రొనాల్డో రికార్డును సమం చేసిన మెస్సీ.. 

ఈ మ్యాచ్ లో మెస్సీ గోల్ చేయడం ద్వారా ప్రపంచకప్ లో   క్రిస్టియానో రొనాల్డో గోల్స్ (7)  ను సమం చేశాడు.  2006 నుంచి ప్రపంచకప్ లలో ఆడుతున్న మెస్సీకి ఇది వరల్డ్ కప్ లో 20వ మ్యాచ్.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios