Asianet News TeluguAsianet News Telugu

FIFA: మ్యాచ్‌కు వచ్చిన ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. స్టేడియం అంతా తిరుగుతూ శుభ్రం చేసిన జపనీయులు

FIFA World Cup 2022: క్రికెట్  మ్యాచ్ లలో అభిమానులకు చేసిన ఈ రచ్చ అందరికీ తెలిసిందే. ఇక 32 దేశాలు పాల్గొంటున్న ఫిఫా వంటి ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో  ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

FIFA World Cup 2022: Japan Fans Clean Stadium, Wins Hearts, Video Went Viral
Author
First Published Nov 23, 2022, 3:39 PM IST

ఏదైనా మ్యాచ్ చూడటానికి స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులు  అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ వెంట తెచ్చుకున్న పేపర్లు, బ్యానర్లు, జెండాలు, పోస్టర్లు, తినుబండారాలు వంటి వాటితో మ్యాచ్ ముగిసేసరికి స్టేడియం అంతా ఓ చిన్నపాటి గార్బేజ్ లా తయారవుతుంది. క్రికెట్  మ్యాచ్ లలో అభిమానులకు చేసిన ఈ రచ్చ అందరికీ తెలిసిందే. ఇక 32 దేశాలు పాల్గొంటున్న ఫిఫా వంటి ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో  ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ లో ఇదే జరిగింది. 

ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య  మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫలితం పక్కనబెడితే  ఆటముగిశాక  జపాన్ కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్  పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు. 

ఖతర్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను  సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో  చెత్త ఉన్న  చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు. తమ దేశం మ్యాచ్ కాకపోయినా   ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. 

జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.  అక్కడ  రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను  జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న  చెత్త డబ్బాల్లో పడేస్తారు. (మనదేశంలో ఎలా  చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన  పన్లేదు)  ఇందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు.   

 

చెత్తనంతా ఎందుకు ఎత్తుతున్నారని సదరు యూట్యూబర్   జపనీయులను ప్రశ్నించగా.. ‘మా పరిసరాలను మేం శుభ్రంగా ఉంచుకుంటాం. మా చుట్టూ  చెత్త కనబడితే మేం దానిని తీసేస్తాం.  మా ప్రదేశాలను మేం గౌరవిస్తాం..’ అని  తెలిపాడు.  ఖతర్ -ఈక్వెడార్ మ్యాచ్ చూడటానికి వచ్చిన  చాలామంది తమ జాతీయ జెండాలను ప్రదర్శించి తర్వాత వాటిని అక్కడే పడేసి వెళ్లారు.  వాటిని తీసుకున్న జపాన్ ఫ్యాన్స్.. జాతీయ జెండాలను గౌరవించాలి గానీ ఇలా ఎక్కడబడితే అక్కడ పడేయడం భావ్యం కాదని తెలిపారు. 

జపనీయులు చేసిన ఈ పని నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. తమకు సంబంధం లేకపోయినా జపాన్ ఫ్యాన్స్ ఇలా చేయడం  ప్రశంసనీయమని.. వారిని చూసి అందరూ నేర్చుకోవాలని కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios