FIFA: ఫుట్‌బాల్, క్రికెట్ ఆడిన ఒకే ఒక్క ఆటగాడు.. ఆ విండీస్ దిగ్గజం ఎవరో తెలుసా..?
FIFA World Cup 2022: ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గానీ ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ క్రికెట్ గానీ ఒలింపిక్స్ లో లేవు. ఈ రెండు క్రీడాంశాల్లోనూ నాలుగేండ్లకోసారి ప్రపంచకప్ లు జరుగుతాయి. మరి క్రికెట్, ఫుట్‌బాల్ ఆడిన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా..?
ఒక ఆటగాడు బహుళ క్రీడల్లో చేయి వేయడం కొత్తేం కాదు. ఒలింపిక్స్ లో అయితే ఇవి సర్వ సాధారణం. చాలా మంది క్రీడాకారులు ఒకే ఒలింపిక్స్ లో పలు ఈవెంట్లలో పాల్గొని పతకాలు కూడా కొట్టారు. అయితే ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గానీ ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ క్రికెట్ గానీ ఒలింపిక్స్ లో లేవు. ఈ రెండు క్రీడాంశాల్లోనూ నాలుగేండ్లకోసారి ప్రపంచకప్ లు జరుగుతాయి. అయితే క్రికెట్, ఫుట్‌బాల్ ఆడిన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా..? ఇదివరకు ఎవరైనా రెండు క్రీడల ప్రపంచకప్ లలో పాల్గొన్నారా..? అంటే అవును అనే చెప్పాలి. ఫుట్‌బాల్ తో పాటు క్రికెట్ ప్రపంచకప్ లు ఆడిన ఏకైక ప్లేయర్ వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివిన్ రిచర్డ్స్.
అవును.. 1970, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. ఫుట్‌బాల్ కూడా ఆడాడు. క్రికెట్ కంటే ముందే ఆయన ఫుట్‌బాల్ లో ప్రావీణ్యం సంపాదించాడు. క్రికెట్ ప్రపంచకప్ లు ఆడటానికి ముందే ఫుట్‌బాల్ ప్రపంచకప్ కూడా ఆడాడు.
క్రికెట్ లోకి రిచర్డ్స్ 1974 లో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది నిర్వహించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ లో కూడా రిచర్డ్స్ పాల్గొన్నాడు. కరేబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లు ఆడాడు. అయితే ఆ ప్రపంచకప్ లో ఆంటిగ్వా అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత 1975 (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్ లలో కూడా భాగమయ్యాడు.
రిచర్డ్స్ కాకుండా క్రికెట్ ఆడుతూనే పలు లీగ్ లకు ఫుట్‌బాల్ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే వీరెవ్వరూ రిచర్డ్స్ మాదిరిగా ఫిఫా వరల్డ్ కప్ ఆడలేదు. వారిలో ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, చార్లెస్ బర్గెస్ ఫ్రై, డెనిస్ కాంప్టన్ (ఈ ఇద్దరిదీ ఇంగ్లాండ్), ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ కూడా ఉన్నారు.