Asianet News TeluguAsianet News Telugu

FIFA: మొరాకో సంచలనం.. పోర్చుగల్ ఇంటికి.. రొనాల్డో ప్రపంచకప్ ఆశలు గల్లంతు

FIFA World Cup 2022: కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న  పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో   కల చెదిరింది.  37 ఏండ్ల రొనాల్డో ప్రపంచకప్ దక్కించుకోవాలన్న  ఆశలు అడియాసలయ్యాయి. క్వార్టర్స్ లో మొరాకో సంచలన విజయంతో  సెమీస్ కు దూసుకెళ్లింది. 
 

FIFA WC 2022: Morocco Scripts History, Beats Portugal in Quarters and Enters in Semis
Author
First Published Dec 11, 2022, 11:41 AM IST

సాకర్ దిగ్గజం, పోర్చుగల్ సారథి క్రిస్టియానో రొనాల్డోకు ఊహించని షాక్.  కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో..  తన దేశానికి ప్రపంచకప్ అందించకుండానే  వెనుదిరిగాడు. క్వార్టర్స్ ఫైనల్స్ లో  భాగంగా శనివారం  రాత్రి  జరిగిన  క్వార్టర్స్ పోరులో మొరాకో.. 1-0 తేడాతో  పోర్చుగల్  ను ఇంటిబాట పట్టించింది. తద్వారా  ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్రకెక్కింది.  మరో మ్యాచ్ లో ఫ్రాన్స్.. 2-1 తేడాతో ఇంగ్లాడ్ ను ఓడించింది. 

పోర్చుగల్ తో ముగిసిన మ్యాచ్ లో మొరాకో   అదరగొట్టింది.  ఆట తొలి అర్థబాగం 42వ నిమిషంలో  అతియత్ అలా అందించిన పాస్ ను  యూసుఫ్  ఎన్ నెసిరి  అమాంతం గాల్లోకి ఎగిరి  గోల్ చేశాడు. దీంతో  మొరాకో ఆధిక్యంలోకి వచ్చింది.

రెండో అర్థభాగంలో  చాలాసేపు  బంతి  పోర్చుగల్ దగ్గరే ఉంది. మొరాకో గోల్ పోస్ట్ ను  టార్గెట్ చేసిన పోర్చుగల్.. పలు ప్రయత్నాలు చేసినా  మొరాకో మాత్రం  అడ్డుకుంది.   గొన్సాలో రామోస్ తో పాటు  ఫెర్నాండెజ్  లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.  విశ్వవిఖ్యాత  ఆటగాడు రొనాల్డోను గత మ్యాచ్ లో మాదిరిగానే  ఆలస్యంగా బరిలోకి దించింది పోర్చుగల్.  ఆట రెండో అర్థభాగం  51వ నిమిషంలో రొనాల్డో ఫీల్డ్ కు వచ్చినా అప్పటికే  జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  చివర్లో రొనాల్డో ఓ గోల్ కొట్టేందుకు యత్నించినా  మొరాకో గోల్ కీపర్ అద్భుతంగా నిలువరించడంతో పోర్చుగల్ గుండె పగిలింది.  తన కెరీర్ లో లోటుగా ఉన్న  ప్రపంచకప్ ను ఈసారైనా సాధించాలని కలలుకన్న రొనాల్డోకు  మరోసారి నిరాశే మిగిలింది.  దీంతో  మ్యాచ్ ముగిశాక రొనాల్డో కన్నీటిపర్యంతమవుతూ గ్రౌండ్ ను వీడాడు.

 

మొరాకో నయా చరిత్ర.. 

1930లో మొదలైన ఫిఫా తొలి ప్రపంచకప్ నుంచి ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న  22వ వరల్డ్ కప్  వరకూ ఏ ఒక్క ఆఫ్రికా జట్టు కూడా  క్వార్టర్స్ దాటి సెమీఫైనల్ కు చేరింది లేదు.  92 ఏండ్ల ప్రపంచకప్ చరిత్రలో 13 ఆఫ్రికా దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి.  తరాలు గడిచానా  ఆఫ్రికన్ జట్టు ఫిఫా సెమీస్ కు చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 

ఇంగ్లాండ్ ను ఓడించిన ఫ్రాన్స్..  

ఇక మరో క్వార్టర్స్  ఫ్రాన్స్ - ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో  ఫ్రాన్స్ తరఫున ఆట 17వ నిమిషంలో  చౌమెని తొలి గోల్ కొట్టాడు. ఆట రెండో అర్థభాగంలో పెనాల్టీ ద్వారా వచ్చిన అవకాశాన్ని  ఇంగ్లాండ్ సద్వినియోగం చేసుకుంది. ఇంగ్లాండ్ తరఫున హ్యారీ కేన్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. కానీ నిర్ణీత సమయం ఇంకో పది నిమిషాల్లో ముగుస్తుందనగా.. 78వ నిమిషంలో ఒలివర్ గిరోడ్ గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-1 కు వెళ్లింది.  

 

సెమీస్ లో..  

క్వార్టర్స్ రేసు ముగియడంతో  ఇక సెమీస్ రేసు మొదలుకానుంది. ఈ నెల 14, 15న నాలుగు జట్లు ఫైనల్ పోరు కోసం తలపడతాయి.  14న తొలి సెమీస్ లో అర్జెంటీనా - క్రొయేషియా  అమీతుమీ తేల్చుకుంటాయి. డిసెంబర్ 15న మొరాకో.. ఫ్రాన్స్ తో ఆడుతుంది. గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు వెళ్తాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios