తొలిసారి సెమీస్‌కు చేరిన మొరాకో.. 13వేల మందికి ఉచితంగా టికెట్లు.. 30 విమానాల్లో తరలింపు..
FIFA World Cup 2022: ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి ఒక ఆఫ్రికన్ జట్టు సెమీఫైనల్ కు చేరడం ఇదే ప్రథమం. అంచనాలేమీ లేని మొరాకో అగ్రశ్రేణి జట్లకు షాకిస్తూ సెమీస్ కు చేరింది.
అనామక జట్టుగా ఖతర్ లో అడుగిడి ఆ తర్వాత అద్భుత ప్రదర్శనలతో సెమీఫైనల్ కు వచ్చిన జట్టు మొరాకో. లీగ్ దశలో బెల్జియం తో పాటు కెనడాలకు షాకిచ్చి ప్రి క్వార్టర్స్ చేరిన ఆ జట్టు క్వార్టర్స్ లో పోర్చుగల్ ను అడ్డుకుని రొనాల్డో ప్రపంచకప్ కలను చెరిపేసింది. అంచనాలకు అందని ప్రదర్శనలతో ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరిన తొలి జట్టుగా మొరాకో సంచలనం సృష్టించింది. నేటి రాత్రి ఆ జట్టు.. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో తలపడనుంది.
తమ దేశం తొలిసారి ప్రపంచకప్ సెమీస్ చేరిన నేపథ్యంలో మొరాకో ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆ దేశ ఫుట్‌బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చింది. 30 ఛార్టర్ట్ ఫ్లైట్ లలో ఏకంగా 13 వేల మంది అభిమానులను మ్యాచ్ జరగాల్సి ఉన్న అల్ బయత్ స్టేడియంలో ఉచితంగా టికెట్లను అందజేసింది.
వీరితో పాటు ఇప్పటికే ఖతర్ లో ఉన్న మొరాకో ఫ్యాన్స్ తో కలిపి సెమీస్ లో ఆ జట్టుకు పూర్తిస్థాయి మద్దతు కలిగేలా ప్లాన్ చేసింది. సుమారుగా ఈమ్యాచ్ కు 40 వేలకు పైగా మొరాకో ఫ్యాన్స్ ఆ జట్టుకు మద్దతివ్వనున్నారు. ఈ టోర్నీలో మొరాకో తొలి నుంచి గోల్స్ చేయకపోయినా అద్భుత డిఫెన్స్ ను కలిగిఉంది. డిఫెన్స్ తో పోర్చుగల్, క్రొయేషియాతో పాటు బెల్జియం వంటి జట్టును కూడా ఓడించింది.
సెమీస్ లో ఫ్రాన్స్ తలపడబోతున్న మొరాకో అంత తేలికైన ప్రత్యర్థైతే కాదు. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు అగ్రశ్రేణి జట్లకు షాకులిస్తూనే ఉంది. లీగ్ దశలో ఆ జట్టు.. తొలి మ్యాచ్ లో క్రొయేషియాతో డ్రా చేసుకున్నా తర్వాత రెండు మ్యాచ్ లలో బెల్జియం, కెనడాలను మట్టికరిపించింది. రౌండ్ ఆఫ్ 16లో మాజీ ఛాంపియన్ స్పెయిన్ కు చుక్కలు చూపించింది. ఇక క్వార్టర్స్ లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ కు షాకిచ్చి సెమీస్ చేరింది. సెమీస్ లో ఫ్రాన్స్ పై కూడా ఇలాంటి ఫలితమే రిపీట్ చేస్తే ఈ నెల 18న ఆ జట్టు అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది.