FIFA: అర్జెంటీనా సూపర్ విక్టరీ.. అమెరికాకు నెదర్లాండ్స్ షాక్.. క్వార్టర్స్‌కు చేరిన దిగ్గజ జట్లు
FIFA World Cup 2022: సంచలన ప్రదర్శనలతో ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ - 16 దశకు చేరిన ఆస్ట్రేలియా జట్టుకు అర్జెంటీనా షాకిచ్చింది. నెదర్లాండ్స్ - యూఎస్ఎ మధ్య ముగిసిన మరో మ్యాచ్ లో డచ్ అసలైన ఆటతో అమెరికాకు చుక్కలు చూపించింది.
ఫుట్‌బాల్ దిగ్గజాలు అర్జెంటీనా, నెదర్లాండ్స్ లు ప్రిక్వార్టర్స్ లో తమ అసలైన ఆటను బయటకు తీశాయి. డిసెంబర్ 3 రాత్రి ఖతర్ లో జరిగిన రెండు మ్యాచ్ లలో అర్జెంటీనా, నెదర్లాండ్స్ ఘన విజయాలు సాధించి క్వార్టర్స్ కు అర్హత సాధించాయి. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా నెదర్లాండ్స్ - యూఎస్ఎ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో డచ్ జట్టు 3-1 తేడాతో అమెరికాను ఓడించింది. రెండో మ్యాచ్ అర్జెంటీనా - ఆస్ట్రేలియా మధ్య ముగియగా.. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా.. 2-1 తేడాతో ఆసీస్ కు షాకిచ్చింది.
గ్రూప్ స్టేజ్ లో అనుకున్న స్థాయిలో రాణించని నెదర్లాండ్స్.. రౌండ్ ఆఫ్ 16లో మాత్రం రెచ్చిపోయింది. అమెరికాపై జూలు విదిల్చింది. బంతి అమెరికా నియంత్రణలోనే ఎక్కువగా ఉన్నా విజయం మాత్రం డచ్ జట్టునే వరించింది.
డచ్ తరఫున 10వ నిమిషంలో డీపే గోల్ కొట్టాడు. 46వ నిమిషంలో డేలీ బ్లైండ్ గోల్ చేశాడు. దీంతో నెదర్లాండ్స్ ఆధిక్యం 2-1 కి చేరింది. అయితే అమెరికా తరఫున హాజి రైట్ గోల్ చేయడంతో అమెరికా రేసులోకొచ్చింది. చివర్లో ఆ జట్టు.. డ్రా చేసేందుకు యత్నించింది. కానీ డచ్ స్టార్ ప్లేయర్ డంప్రీస్.. 81వ నిమిషంలో గోల్ చేసి తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.
అర్జెంటీనా దూకుడు..
మరో మ్యాచ్ లో అర్జెంటీనా.. 2-1 తేడాతో ఆసీస్ ను ఓడించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ను బోల్తా కొట్టించింది. ఆట 35వ నిమిషంలో మెస్సీ తొలి గోల్ చేశాడు. ఆట రెండో భాగంలో 57వ నిమిషంలో అర్జెంటీనాకు మరో గోల్ దక్కింది. అియతే 77వ నిమిషంలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఫెర్నాండేజ్ గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఆధిక్యం తగ్గినా విజయం మాత్రం అర్జెంటీనానే విరించింది. ఈ మ్యాచ్ మెస్సీ కెరీర్ లో 1000వ మ్యాచ్ కావడం గమనార్హం.
- అర్జెంటీనా - నెదర్లాండ్స్ ఈనెల 10న క్వార్టర్ ఫైనల్స్ లో తలపడతాయి.
రౌండ్ - 16 లో నేటి మ్యాచ్ లు :
- ఫ్రాన్స్ వర్సెస్ పోలండ్
- ఇంగ్లాండ్ వర్సెస్ సెనెగల్