ఖతర్‌లో ఫిఫా పోటీలు.. కేరళలో కొట్టుకుంటున్న ఫ్యాన్స్.. ఇదేం పైత్యం..!
FIFA World Cup 2022: ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో ఫుట్‌బాల్ ఫీవర్ పాకింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో ఇప్పటికే లీగ్ దశ మొదలై మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
రెండ్రోజుల క్రితం గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ పోటీలలో లీగ్ దశ మొదలైంది. ఖతర్, ఇరాన్, ఈక్వెడార్, ఇంగ్లాండ్, సౌదీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు తమ తొలి మ్యాచ్ ఆడేశాయి. ఫలితాల మాట ఎలా ఉన్నా ఫిఫా ప్రపంచకప్ రోజుకో సంచలనం, వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలుస్తున్నది. ఖతర్ లో నిర్వహణపై యూరోపియన్ దేశాల ఫుట్‌బాల్ ఫ్యాన్స్ రోజూ తగువులాడుతుంటే అసలు ఈ ఆటతో ఏ సంబంధం లేని ఇండియాలో ఫ్యాన్స్ తగువులాడుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత..? అన్న రేంజ్ లో కొట్టుకుంటున్నారు. చేతికి ఏది దొరికితే దానితో ప్రత్యర్థుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఖతర్ లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అరేబియా తీరానికి అనుకుని ఉన్న రాష్ట్రం కేరళలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. కేరళలో క్రికెట్ ను అంతగా పట్టించుకోరు గానీ ఫుట్‌బాల్ అంటే మాత్రం అభిమానం ఎక్కువ. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైన రోజు అక్కడ ఫుట్‌బాల్ అభిమానులు ర్యాలీలు తీశారు.
కేరళలోని కొల్లాం జిల్లాలోని సక్తిఉలంగర గ్రామంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు తీశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్ అభిమానులుండగా మరికొందరు అర్జెంటీనా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరు.. లేదు లేదు అర్జెంటీనాదే కప్పు అని మరికొందరు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదాలు కాస్తా గొడవకు దారి తీశాయి. ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు, ఇనుప రాడ్లు అందుకుని వీపులు విమానం మోత మోగేలా కొట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలాఉండగా ఫ్యాన్స్ కొట్టుకున్న ఈ ఘటనలో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిమీద ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సదరు ఫ్యాన్స్ మీద లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
కాగా మనది కాని మనకు సంబంధం లేని ఆట, దేశాల గురించి మారుమూల గ్రామస్తులు గొడవపడటమేంటని ఈ వీడియోను చూసిన నెటిజన్లు వాపోతున్నారు. అయినా ఈ ప్రపంచకప్ లో బ్రెజిల్, అర్జెంటీనాలు ఒక గ్రూప్ లో లేవు. గ్రూప్-సీలో అర్జెంటీనా ఉండగా గ్రూప్-జీలో బ్రెజిల్ ఉంది. ఈ రెండు లీగ్ దశను దాటి నాకౌట్ దశకు చేరితే పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. కానీ కేరళలో మాత్రం ఫ్యాన్స్.. తమ జట్టే అంటే తమ జట్టు గెలుస్తుందని గొడవలకు దిగడం గమనార్హం.