పాత రికార్డులను బద్దలుకొట్టిన ఖతర్.. ఈసారి గోల్స్ జాతరే.. 92 ఏండ్లలో ఇదే ప్రథమం..
FIFA World Cup 2022: ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ పలు రికార్డులను సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఫుట్‌బాల్ ప్లేయర్లు గోల్స్ జాతర చేసుకున్నారు.
నెలరోజుల పాటు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను అలరించిన ఫిఫా వరల్డ్ కప్‌కు ఆదివారం అర్జెంటీనా - ఫ్రాన్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత తెరపడింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఇరు జట్లూ చెరో మూడు గోల్స్ చేయడంతో పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. షూట్ అవుట్ లో అర్జెంటీనా నాలుగు గోల్స్ చేయగా ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. మొత్తంగా ఈ మ్యాచ్ లోనే 12 గోల్స్ నమోదయ్యాయి. మరి ఈ టోర్నీ మొత్తంలో ఎన్ని గోల్స్ నమోదయ్యాయి..?
32 దేశాల ఆటగాళ్లు పాల్గొన్న ఫిఫా వరల్డ్ కప్ 2022 గోల్స్ విషయంలో కొత్త రికార్డులు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ లో 32 టీమ్స్ కలిపి ఏకంగా 172 గోల్స్ కొట్టాయి. 92 ఏండ్ల ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చరిత్రలో ఇన్ని గోల్స్ నమోదవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
2022 కంటే ముందు 2014, 1998లో కూడా వివిధ జట్లు 171 గోల్స్ చేశాయి. కానీ ఖతర్ లో మాత్రం పాత రికార్డులన్నీ నమోదయ్యాయి. నాలుగేండ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో ప్రతీ ప్రపంచకప్ లో నమోదైన గోల్స్ ను ఓసారి చూస్తే..
1930లో ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ తొలి టోర్నీలో మొత్తంగా 70 గోల్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత 1934 (79), 1938 (84), 1938 (84), 1950 (88), 1954 (140), 1958 (126), 1962 (89), 1966 (89), 1970 (95), 1974 (97), 1978 (102), 1982 (146), 1986 (132), 1990 (115), 1994 (141), 1998 (171), 2002 (161), 2006 (147), 2010 (143), 2014 లో 171 గోల్స్ నమోదవగా 2018 లో 169 గోల్స్ కొట్టారు ఫుట్‌బాల్ ప్లేయర్లు.
- ఇక వ్యక్తిగతంగా చూస్తే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపే. ఈ టోర్నీలో అతడు 8 గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
- అత్యధిక గోల్స్ నమోదైన మ్యాచ్ : ఇంగ్లాండ్ (6)-ఇరాన్ (2)
- అత్యధిక గోల్స్ చేసిన జట్టు : ఫ్రాన్స్ (16)