Asianet News TeluguAsianet News Telugu

FIFA: జపాన్ షూట్ అవుట్.. నాలుగోసారి క్వార్టర్స్ ఆశలు గల్లంతు.. సౌత్ కొరియాను ఇంటికి పంపిన బ్రెజిల్

FIFA World Cup 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ప్రపంచకప్ లో  గ్రూప్ దశలో మెరుపులు మెరిపించి  ప్రపంచ మాజీ ఛాంపియన్లైన జర్మనీ, స్పెయిన్ లను ఓడించిన జపాన్ పోరాటం ప్రిక్వార్టర్స్ లోనే ముగిసింది. 
 

FIFA 2022: Japan Lost Against  Croatia, Brazil Beats South Korea in Round Of 16
Author
First Published Dec 6, 2022, 11:01 AM IST

ఫిఫా ఫుట్‌బాల్  ప్రపంచకప్ లో లీగ్ దశలో సంచలన విజయాలతో అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన జపాన్.. మరోసారి ప్రిక్వార్టర్స్ లోనే వెనుదిరిగింది. లీగ్ లో ప్రపంచ మాజీ ఛాంపియన్లు అయిన జర్మనీ, స్పెయిన్ లను ఓడించిన ఆ జట్టు ప్రిక్వార్టర్స్ లో గత టోర్నీలో రన్నరప్ క్రొయేషియా చేతిలో ఓడింది. మ్యాచ్ లో బాగానే పోరాడినా చివరికి షూటౌట్ లో మాత్రం తేలిపోయింది.  షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో క్రొయేషియా 3-1 తేడాతో జపాన్ పై గెలవగా  మరో మ్యాచ్ లో   బ్రెజిల్.. 4-1 తేడాతో సౌత్ కొరియాపై గెలుపొంది  క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. 

జపాన్-క్రొయేషియా మ్యాచ్ ఆధ్యంతం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఆట ప్రథమార్థం 43 వ నిమిషంలో  జపాన్ ఆటగాడు డైజెన్ మేడా గోల్ కొట్టడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది.   సెకండ్ హాఫ్ లో క్రొయేషియా  ఆటగాడు లావ్రెన్.. గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు మరో గోల్ చేయకపోవడంతో  మ్యాచ్ లో అదనపు సమయాన్ని కేటాయించారు. 

ఎక్స్ట్రా టైమ్ లో కూడా ఇరుజట్లు హోరాహోరిగా తలపడ్డాయి.  గోల్ కొట్టడానికి, ప్రత్యర్థి గోల్ ను అడ్డుకునేందుకు రెండు జట్లు పోరాడాయి. దీంతో  విజేతను నిర్ణయించడానికి షూటౌట్ ను   ఆడించాల్సి వచ్చింది. షూటౌట్ లో క్రొయేషియా ఆటగాళ్లు  మూడు గోల్స్ కొట్టారు. కానీ జపాన్ నుంచి మాత్రం ఒకటే గోల్ నమోదైంది. దీంతో 3-1 తేడాతో  క్రొయేషియా  క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. 

 

ఇక బ్రెజిల్  - సౌత్ కొరియా మ్యాచ్ లో  మాజీ ఛాంపియన్లు అదిరిపోయే ఆటతో దక్షిణ కొరియాను  ఇంటికి పంపారు. బ్రెజిల్ తరఫున విని జూనియర్ ఆట 7వ నిమిషంలో తొలి గోల్ కొట్టాడు.  ఈ మ్యాచ్ కు ముందు గాయపడి  రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న బ్రెజిల్ స్టార్ నైమర్.. 13వ నిమిషంలో రెండో గోల్ చేశాడు.  రిచర్లీసన్ 29వ నిమిషంలో మూడో గోల్ కొట్టగా.. లుకాస్ పెక్వెటా నాలుగో గోల్ చేసి బ్రెజిల్ కు  తిరుగులేని ఆధిక్యం అందించారు.  దక్షిణకొరియా తరఫున  పైక్ సాంగ్ హూ.. ఆట 76వ నిమిషంలో గోల్ కొట్టాడు.  సెకండ్ హాఫ్ లో సౌత్ కొరియా దూకుడుగా ఆడినా బ్రెజిల్ మాత్రం గోల్స్ చేసే అవకాశమివ్వలేదు.   

6 ఖాయం..మిగిలినవి రెండు 

రౌండ్ ఆఫ్ - 16లొ ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్ లలో ఆరు జట్లు తమ  క్వార్టర్స్ బెర్త్ లను ఖాయం చేసుకున్నాయి. ఆ ఆరు జట్లు  అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్, క్రొయేషియా. ఈ దశలో ఆస్ట్రేలియా,  యూఎస్ఎ,  పోలండ్, సెనెగల్, జపాన్, సౌత్ కొరియాలు ఇంటిబాట పట్టాయి. 

 

ఫిఫా లో నేడు.. 

- మొరాకో వర్సెస్ స్పెయిన్ 
- పోర్చుగల్ వర్సెస్ స్విట్జర్లాండ్ 

Follow Us:
Download App:
  • android
  • ios