ఫిఫా ఫ్యాన్స్‌కు ‘క్యామెల్ ఫ్లూ’ గండం..! మరో మహమ్మారి తప్పదని నివేదికలు.. ఒంటెలకు దూరంగా ఉండాలని హెచ్చరిక
FIFA World Cup 2022: ఎడారి దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బల్ ప్రపంచకప్ కు వెళ్లిన అభిమానులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఖతర్ ప్రభుత్వం తాజాగా ‘క్యామెల్ ఫ్లూ’ హెచ్చరికలు జారీ చేసింది. ఒంటెలను ముట్టుకోవద్దని ఆదేశించింది.
రెండేండ్ల క్రితం చైనాలో పుట్టి ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి భయం ఇంకా తొలిగిపోనే లేదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. ఏదో ఒక దేశంలో ఈ వైరస్ తన రూపాలు మార్చుకుని ఇప్పటికీ ప్రజలమీద విరుచుకుపడుతూనేఉంది. ఇక తాజాగా మరో మహమ్మారి కూడా ప్రపంచాన్ని కుదిపేయడానికి సిద్ధమవుతోందని నివేదికలు ఘోషిస్తున్నాయి. అందుకు ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ వేదిక కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రీడా ప్రపంచకప్ ఫిఫా. ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నది 32 దేశాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఖతర్ లో సుమారు 1.2 మిలియన్ (సుమారు 11 లక్షలు) మంది అబిమానులు కొలువు తీరారు. ఇదే కొత్త మహమ్మారికి కారణమవ్వొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఖతర్ లో ‘క్యామెల్ ఫ్లూ’ గండం పొంచి ఉందని ‘న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్’ జర్నల్ లో ఓ కథనం ప్రచురితమైంది. భారీ స్థాయిలో గుమిగూడుతున్న ప్రజలు ‘క్యామెల్ ఫ్లూ’ భారీన పడొచ్చని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఏంటి క్యామెల్ ఫ్లూ..?
ఒంటెల నుంచి వ్యాపించే ఈ వైరస్ (క్యామెల్ ఫ్లూ) ను డబ్ల్యూహెచ్‌వో.. మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ (మెర్స్)గా 2012లోనే గుర్తించింది. ఖతర్ సరిహద్దుల్లో సౌదీ అరేబియాలో తొలిసారిగా క్యామెల్ ఫ్లూ కేసును గుర్తించారు. ఇప్పటివరకు 27 దేశాలలో సుమారు 2,600కు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 935 మంది మరణించారని యూకేకు చెందిన సైన్స్ వెబ్సైట్ ఐఎఫ్ఎల్ సైన్స్ నివేదిక తెలిపింది. ఒక నివేదిక ప్రకారం క్యామెల్ ఫ్లూ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తున్నారట. సమీప భవిష్యత్ లో క్యామెల్ ఫ్లూ కూడా మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే అంచనా వేసింది. తాజాగా ఖతర్ లో భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడుతుండటంతో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లక్షణాలు..
కరోనా మాదిరిగానే ఎలాంటి లక్షణాలు లేకుండానే జ్వరం, శ్వాసలో ఇబ్బంది, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి క్యామెల్ ఫ్లూ లక్షణాలు.
ఖతర్ రెడీ..
ఒంటెల నుంచి వ్యాపించే ఈ ఫ్లూ బారినపడకుండా ఉండేందుకు గాను అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. పర్యాటకులు ఒంటెలను ముట్టుకోకుండా ఉంటేనే మంచిదని హెచ్చరించింది. ఫిఫా చూడటానికి వచ్చిన అభిమానులు.. ఎడారిలో ఒంటెల మీద ఎక్కి సవారీ చేయాలనుకుంటారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వ అధికారులు టూరిస్టులకు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా అనుకోని ఆపద వస్తే ఎదుర్కోవడానికి కూడా ఖతర్ ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్యాన్స్ విలేజ్ లో పరిసరాల పరిశుభ్రత, వ్యాక్సినేషన్, శుభ్రమైన ఆహారం వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడూ హెచ్చరికలు జారీ చేస్తున్నది. వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి క్యామెల్ ఫ్లూకు సంబంధించిన కేసులు నమోదైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నది.
ఇదంతా కుట్రనేనా..?
అయితే ఈ వైరస్ పై ఖతర్ కావాలని వార్తలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో యూరోపియన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సెక్స్ బ్యాన్ నుంచి దృష్టిని మరల్చడానికే ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయమై యూరప్ ఫ్యాన్స్ అంతా పలు వెబ్సైట్స్ ఖతర్ కు అమ్ముడుపోయాయని దుమ్మెత్తిపోస్తున్నారు. క్యామెల్ ఫ్లూ అనేది కొత్తదేమీ కాదని, కానీ ఇప్పుడే దానికి ఇంత ప్రచారం కల్పించాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు.