FIFA: క్రొయేషియాదే మూడోస్థానం.. మొరాకోకు తప్పని పరాభవం..
FIFA World Cup 2022: గత టోర్నీలో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో మాత్రం మూడో స్థానంలో నిలిచింది. శనివారం మొరాకోతో ముగిసిన పోరులో క్రొయేషియా.. విజయంతో టోర్నీని ముగించింది.
అంచనాలే లేని స్థితి నుంచి అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చి ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన మొరాకో.. ఆఖరి మెట్టుమీద తడబడింది. సెమీస్ లో ఫ్రాన్స్ చేతిలో ఓడిన మొరాకో.. శనివారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో కూడా ఓటమిపాలైంది. 2018లో రష్యా వేదికగా ముగిసిన టోర్నీలో ఫైనల్ లో ఫ్రాన్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా.. ఖతర్ లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో క్రొయేషియా 2-1 తేడాతో మొరాకోను ఓడించి టోర్నీని విజయంతో ముగించింది.
క్రొయేషియా తరఫున ఆట ఏడవ నిమిషంలోనే జోస్కో గ్వార్డియోల్ తొలి గోల్ కొట్టాడు. అయితే రెండు నిమిషాల తర్వాత మొరాకో ఆటగాడు అచ్రఫ్ డారీ తలతో బంతిని గోల్ పోస్ట్ లోకి పంపి స్కోరును సమం చేశాడు. ఫస్టాఫ్ ముగుస్తుందనగా ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్ చేశాడు. దీంతో మొరాకో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆట సెకండాఫ్ లో మొరాకో గోల్ చేయడానికి యత్నించినా సఫలం కాలేదు. బలమైన డిఫెన్స్ ఉన్న మొరాకో.. క్రియేషియాపై దాడికి దిగలేకపోయింది. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నా మొరాకో ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించింది. గ్రూప్ దశలో బెల్జియంను ఓడించి షాకిచ్చిన ఆ జట్టు ప్రి క్వార్టర్స్ లో స్పెయిన్ ను ఓడించింది. క్వార్టర్స్ లో పోర్చుగల్ ను ఇంటికి పంపించింది. ఫిఫా ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరిన ఆఫ్రికా దేశంగా నిలిచింది. సెమీస్ లో ఫ్రాన్స్ చేతిలో ఓడినా మనసులు గెలిచింది.
ఇక మూడో స్థానం ముగియడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచేదెవరో నేడు తేలనుంది. నేటి రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. అర్జెంటీనాతో పోటీ పడనుంది. చివరి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన వరల్డ్ కప్ లోటును తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా.. వరుసగా రెండో సారి (గెలిస్తే మూడోసారి) కప్ కొట్టడానికి ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతున్నది. మరి నేటి రాత్రి ఖతర్ లో విశ్వవిజేతగా నిలిచేదెవరోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.