గోవాలో సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విగ్రహం.. వ్యతిరేకిస్తున్నవారికి రాష్ట్ర మంత్రి ఘాటు రిప్లై

Cristiano Ronaldo Statue: 410 కిలోలున్న ఈ విగ్రహాన్ని తయారుచేయించడానికి రూ. 12 లక్షల ఖర్చు చేశారు. రెండేండ్ల క్రితమే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నా కోవిడ్ కారణంగా వాయిదా వేశారు.

Cristiano Ronaldo statue Installed In Goa, State Minister Minister Asks Youth To Take Football to Next Level

సాకర్ దిగ్గజం, క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్న పోర్చుగీస్ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పరిచయం అక్కర్లేని పేరు. అతడి విగ్రహాన్ని గోవాలో ఆవిష్కరించారు. భారతదేశంలో రొనాల్డో విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ఇదే ప్రథమం. గోవా రాజధాని పనాజీలో దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంతో పాటు దేశంలో ఫుట్బాల్ పట్ల యువతలో స్పూర్తిని నింపేందుకే దీనిని ఏర్పాటు చేసినట్టు ఏకంగా రాష్ట్ర మంత్రి మైకేల్ లోబో అన్నారు. 410 కిలోలున్న ఈ విగ్రహాన్ని తయారుచేయించడానికి రూ. 12 లక్షల ఖర్చు చేసినట్టు మంత్రి చెప్పారు. ఇదిలాఉండగా.. ఇతర దేశానికి చెందిన క్రీడాకారుడి విగ్రహాన్ని  భారత్ లో ఎలా ఏర్పాటు చేస్తారని పలు మత సంఘాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి.  

మంగళవారం రాత్రి మైకేల్ లోబో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోబో మాట్లాడుతూ... ‘రొనాల్డో విగ్రహాన్ని భారత్ లో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది యువతకు స్పూర్తినిచ్చేందుకు తీసుకున్న ఒక కార్యక్రమం తప్ప మరో ఉద్దేశం లేదు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఫుట్బాల్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. దానిని మార్చాల్సిన అవసరం ఉంది. 

 

ఇక్కడకు వచ్చే యువత ఈ విగ్రహాన్ని చూస్తూ.. అక్కడ సెల్ఫీలు తీసుకుని రొనాల్డో నుంచి స్ఫూర్తిని పొందాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు.. యువత ఫుట్బాల్ ఆడటానికి అన్ని  మౌలిక వసతులు కల్పించాలి..’ అని అన్నారు. 

గోవాతో పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించే విధంగా క్రీడాకారులను తయారుచేసేందుకు తాము కృషి చేస్తున్నామని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో  ఫుట్బాల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడ మాజీ ఆటగాళ్లను కోచ్ లుగా నియమించి  యువతను ఈ క్రీడను ఆడటానికి తమవంతు సాయం చేస్తామని లోబో చెప్పారు. ఇదిలాఉండగా ఈ విగ్రహ ఏర్పాటుపై  విమర్శలు చేస్తున్ వారికి ఆయన ఘాటు రిప్లై ఇచ్చారు. 

‘ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు పలువురు విమర్శలు చేస్తున్నారనే విషయం నాకు తెలుసు. అయితే ఫుట్బాల్ ఆట గురించి తెలియనివాళ్లు మాత్రమే  ఈ విమర్శలు చేస్తున్నారు. ఫుట్బాల్ లో మనదేశం ఏ స్థానంలో ఉందో అవగాహన లేనివాళ్లే అలా వాగుతున్నారు.  మిగతా ఆటల్లాగే ఫుట్బాల్ కూడా ఒక గేమ్. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చేయడంలో ఫుట్బాల్ ఎంతో కృషి చేస్తున్నది. ఇంత చెప్పాక కూడా వాళ్లు నిరసనలు  చేస్తామంటే ఇక నేనేమీ చేయలేను...’ అని  నిరసనకారులకు  లోబో కౌంటర్ ఇచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios