Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తోపు రికార్డు సొంతం.. ఇప్పట్లో అందుకునేటోడే లేడు..
Ronaldo 800 Goals: ఆధునిక కాలంలో ఫుట్బాల్ మాంత్రికుడుగా గుర్తింపు పొందిన క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో చరిత్ర సృష్టించాడు. మాంచెస్టర్ యునైటెడ్, అర్సినల్ మధ్య జరిగిన కీ ఫైట్ లో రెండు గోల్స్ కొట్టిన రొనాల్డో.. తన జట్టును గెలిపించడమే గాక ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. తన కెరీర్ లో 800 వ గోల్ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో 1131 మ్యాచులాడిన రొనాల్డో.. 801 గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య గుర్తించిన దాని ప్రకారం ఇప్పటివరకు అత్యధిక గోల్స్ చేసిన రికార్డు సాకర్ సూపర్ స్టార్, బ్రెజిల్ లెజెండ్ పీలే పేరు మీద ఉంది. పీలే తన కెరీర్ లో 765 గోల్స్ కొట్టగా.. రొనాల్డో 801 గోల్స్ చేశాడు. ఇందులో లీగ్స్ తరఫున 485, మేజర్ టోర్నీలలో 51, పోర్చుగల్ తరఫున 115, కాంటినెంటల్ లో 150 గోల్స్ కొట్టాడు.
అయితే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ హిస్టరీ అండ్ స్టాటిటిక్స్ ప్రకారం చూస్తే ఈ జాబితాలో ఆస్ట్రియా-చెక్ కు చెందిన ఆటగాడు జోసెఫ్ బైకన్ (948) గోల్స్ తో రొనాల్డో కన్నా ముందున్నాడు. కానీ దీనిపై స్పష్టత లేదు. పలు ఆంగ్ల, యూరోపియన్ పత్రికలు, గణాంకాల ప్రకారం బైకన్ 750 కంటే ఎక్కువ గోల్స్ చేయలేదని రాశాయి. మరో జర్మన్ స్ట్రైకర్ హెల్మ్చెన్ కూడా 980 కిపైగా గోల్స్ కొట్టాడని చెబుతున్నా అధికారికంగా దానికి రుజువులు లేవు. కావున ఇప్పటికైతే అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో రొనాల్డోదే మొదటిస్థానం. రొనాల్డో సమకాలీకుడు.. అతడి సమీప ప్రత్యర్థి లియోనాల్ మెస్సీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మెస్సీ తన కెరీర్ లో 756 గోల్స్ కొట్టాడు.
కాగా.. ఆఖరు నిమిషం వరకు హోరాహోరిగా సాగిన మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ అర్సినల్ మ్యాచ్ లో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న మాంచెస్టర్ ఘన విజయం సాధించింది. మాంచెస్టర్ తరఫున.. బ్రూనో ఫెర్నాండో ఆట 44 వ నిమిషంలో గోల్ కొట్టగా.. రొనాల్డో.. 52వ నిమిషం, 70వ నిమిషంలో గోల్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మాంచెస్టర్ యునైటెడ్.. 3-2 తేడాతో అర్సినల్ పై విజయాన్ని నమోదు చేసింది.