FIFA: జర్మనీ, బెల్జియం ఔట్.. మిగిలిన బెర్తులు రెండే.. రౌండ్-16కు అంతా సిద్ధం..
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో గురువారం పలు జట్లు సంచలన విజయం అందుకోగా టోర్నీ ఫేవరెట్లుగా ఉన్న రెండు జట్లు మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి.
ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న బెల్జియం, గతంలో నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన జర్మనీలకు గురువారం ఖతర్ లో ఊహించని, తమ దేశ ఫుట్‌బాల్ అభిమానులు జీర్ణించుకోలేని ఫలితాలు వచ్చాయి. కీలకమైన మ్యాచ్ లలో ఓడి మొదటి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిబాటపట్టాయి. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాయి.
నాకౌట్ బెర్త్ దక్కాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచ్ లో బెల్జియం.. క్రొయేషియాపై డ్రా చేసుకుంది. దీంతో గ్రూప్ స్టేజ్ లో బెల్జియం కంటే అత్యధిక పాయింట్లు కలిగిన క్రొయేషియా తదుపరి రౌండ్ కు ముందడుగువేసింది. గ్రూప్-ఎఫ్ లో మొరాకో, క్రొయేషియాలు రౌండ్ -16 కు అర్హత సాధించగా బెల్జియం, కెనడా ఎలిమినేట్ అయ్యాయి.
ఇక జర్మనీ విషయానికొస్తే.. కొస్టారికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆ జట్టు దారుణంగా ఓడింది. కొస్టారికా 4-2 తేడాతో జర్మనీని ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది. గ్రూప్ -ఇలో భాగంగా ఉన్న జర్మనీ.. గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. 1938 నుంచి 2018 వరకు ఆ జట్టు ఒక్కసారి కూడా గ్రూప్ దశలో నిష్క్రమించలేదు. కానీ వరుసగా రెండోసారి జర్మనీ.. ప్రిక్వార్టర్స్ కు చేరకుండానే ఇంటి బాట పట్టడం గమనార్హం. మరో మ్యాచ్ లో జపాన్.. స్పెయిన్ ను మట్టికరిపించి ముందడుగు వేసింది.
ఇప్పటివరకు రౌండ్ - 16కు చేరిన జట్లు :
- ఫ్రాన్స్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, సెనెగల్, ఇంగ్లాండ్, యూఎస్ఎ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, పోలండ్, క్రొయేషియా, మొరాకో, స్పెయిన్, జపాన్
ఎలిమినేట్ అయిన టీమ్స్ :
- ఈక్వెడార్, ఖతర్, ఇరాన్, వేల్స్, కెనడా, డెన్మార్క్, ట్యునిషియా, మెక్సికో, సౌదీ అరేబియా, బెల్జియం, కెనడా, జర్మనీ, క్రొయేషియా
రౌండ్-16 డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే 14 జట్లు తమ బెర్త్ ను ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు బెర్తుల కోసం గ్రూప్ - జి, గ్రూప్ - హెచ్ లలో ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ - జి నుంచి ఇప్పటికే బ్రెజిల్ క్వాలిఫై అవగా.. తదుపరి స్థానం కోసం స్విట్జర్లాండ్, కామెరూన్, సెర్బియా ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ - హెచ్ నుంచి పోర్చుగల్ అర్హత సాధించగా ఘనా, సౌత్ కొరియా, ఉరుగ్వేల మధ్య జరిగే మ్యాచ్ లలో విజేత ప్రిక్వార్టర్స్ కు చేరుతుంది.