Diego Maradona Watch: మరడోనా మరణానంతరం ఆయనకు సంబంధించిన పలు వస్తువులను దుబాయ్ లోని ఓ కంపెనీ భద్రంగా దాస్తున్నది. అయితే  గత ఆగస్టు నుంచి మరడోనా  వాడిన Hublot కనబడకుండా పోయింది. 

అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మరడోనాకు చెందిన వాచ్ ఒకటి ఇటీవలే దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. దుబాయ్ లో మాయమైన ఆ గడియారం.. అసోంలో ప్రత్యక్షమైంది. ఆ వాచ్ ను కొట్టేసిన వ్యక్తిని భారత్ లో పట్టుకున్నారు పోలీసులు. మరడోనా మరణానంతరం ఆయనకు సంబంధించిన పలు వస్తువులను దుబాయ్ లోని ఓ కంపెనీ భద్రంగా దాస్తున్నది. అయితే గత ఆగస్టు నుంచి మరడోనా వాడిన Hublot వాచ్ కనబడకుండా పోయింది. దీంతో అప్పట్నుంచి ఇంటర్ పోల్ పోలీసులు దొంగకోసం వెతుకుతున్నారు. 

కాగా.. తాజాగా దుబాయ్ పోలీసులు, భారతీయ రక్షక దళాల సాయంతో దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ట్విట్టర్ లో తెలపడం గమనార్హం. వాచ్ ను దొంగతనం చేసిన వ్యక్తిని వాజిద్ హుస్సేన్ గా గుర్తించారు. అతడిది అసోంలోని శివసాగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.

Scroll to load tweet…

అసలేం జరిగిందంటే... 

మరడోనా బతికున్న రోజుల్లో ఆయన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న హుబోల్ట్ వాచ్ ను వాడేవారు. కానీ ఆయన మరణానంతరం ఆ వాచ్ తో పాటు ఇతర వస్తువులను దుబాయ్ లో ఓ చోట జాగ్రత్తగా దాచారు. ఆ స్టోర్ కు అసోంకు చెందిన వాజిద్ హుస్సేన్.. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇంకేముంది.. అక్కడున్న భద్రతా వ్యవస్థనంతా తెలుసుకున్న వాజిద్.. మాటువేసి మరడోనా వాచ్ ను దొంగిలించాడు. 

ఆ తర్వాత ఊళ్లో తన తండ్రికి బాగోలేదని చెప్పి అక్కడ్నుంచి ఉడాయించాడు వాజిద్. వాచ్ తో ఇండియాకు తిరిగివచ్చాడు. అయితే వాజిద్ వెళ్లిన కొద్దిరోజుల తర్వాత మరడోనా వాచ్ కూడా కనిపించకపోయేసరికి అనుమానం వచ్చిన సదరు స్టోర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వాజిద్ ను దొంగగా అనుమానించిన పోలీసులు.. భారత్ కు వచ్చి ఇక్కడి పోలీసుల సాయంతో అతడిని పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు దొంగను పట్టుకుని అతడి దగ్గర వాచ్ స్వాధీనం చేసుకున్నట్టు అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తెలిపారు. 

Scroll to load tweet…

ఇక ఇదే విషయమై అసోం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘భారతీయ పోలీసుల సాయంతో దుబాయ్ పోలీసులు హుబ్లాట్ వాచ్ ను దొంగిలించిన వాజిద్ హుస్సేన్ ను పట్టుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..’ అని ట్వీట్ చేశారు.