FIFA: మొన్న ఇరాన్.. నిన్న జర్మనీ.. నిరసనలకు వేదికవుతున్న ఫిఫా వరల్డ్ కప్
FIFA World Cup 2022: రోడ్ల మీదో, వీధుల్లోనో చేసే నిరసన కంటే అంతర్జాతీయ వేదికలపై నిరసిస్తే అది ప్రధాన వార్త అవుతుంది. ప్రపంచమంతా దాని మీద దృష్టి మళ్లిస్తుంది. ఇలా అంతర్జాతీయ వేదికల మీద తమ గళాలు వినిపించినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా అరబ్ దేశం ఖతర్ వేదికగా కూడా..
నిరసన రూపాలు పలు విధాలు. ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వాలు, అధికారులు, సంస్థలు ఒంటెద్దు పోకడలకు పోతుంటే దానిని ప్రతిఘటించేందుకు పౌరులు ఎంచుకునే రూపమే నిరసన. రోడ్ల మీదో, వీధుల్లోనో చేసే నిరసన రూపాల కంటే అంతర్జాతీయ వేదికలపై నిరసన చేస్తే అది ప్రధాన వార్త అవుతుంది. ప్రపంచమంతా దాని మీద దృష్టి మళ్లిస్తుంది. ఇలా అంతర్జాతీయ వేదికల మీద తమ గళాలు వినిపించినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా అరబ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ కూడా నిరసనలకు వేదికవుతున్నది. మొన్న ఇరాన్, నిన్న జర్మనీలు తమ నిరసనను తెలియజేశాయి.
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఆ దేశపు జాతీయ జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్లు ఖతర్ లో తాము ఆడబోయే మ్యాచ్ నే వేదిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్ చర్యలకు నిరసనగా, ఉద్యమకారులకు సంఘీభావంగా ఆ దేశ ఫుట్బాల్ ఆటగాళ్లు జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపారు.
తాజాగా జపాన్-జర్మనీ మ్యాచ్ కూడా నిరసనకు వేదికైంది. మ్యాచ్ కు ముందు జర్మనీ ఆటగాళ్లు గ్రూప్ ఫోటో తీసుకుంటూ కుడిచేతితో తమ నోరు మూసుకున్నారు. జర్మనీకి వచ్చిన తిప్పలేంటి..? అక్కడ అంతా బాగానే ఉంది కదా అనుకున్నారేమో. ఆటగాళ్లకు దేశంతో వచ్చిన తిప్పలేమీ లేవు. కానీ వారి సమస్యంతా ఫిఫా తోనే. ఫిఫా తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా జర్మనీ ఆటగాళ్లు నిరసనకు దిగారు. ఈ టోర్నీలో ‘వన్ లవ్’ ఆర్మ్ బ్యాండ్ లను ధరించడాన్ని ఫిఫా బ్యాన్ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు అలా చేస్తే వారిపై వేటు (ఎల్లో కార్డు చూపించి) వేస్తుంది. ఈ మేరకు జర్మనీ సహా ఏడు యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్యలకు ఫిఫా కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకు వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్..?
ఖతర్ లో మానవహక్కుల హననం, వివిధ వర్గాలపై సాగుతున్న వివక్షను నిరసిస్తూ పలు యూరోపియన్ జట్లు తమ ఫుట్బాల్ జట్లు మ్యాచ్ లు ఆడే సమయంలో ఈ వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇది ఫిఫాకు ఆగ్రహం కలిగించింది. ఎవరైనా ఆటగాడు అలా చేస్తే వేటు తప్పదని హెచ్చరించింది. అందుకే జర్మనీ ఆటగాళ్లు మ్యాచ్ కు ముందు ఇలా నోరు మూసుకుని నిరసన తెలిపారు. ‘వన్ లవ్ బ్యాండ్లు ధరించకూడదనడం మా నోర్లు నొక్కేయడమే’ అని సింబాలిక్ గా సూచిస్తూ ఇలా చేశారు. ఇదే విషయాన్ని జర్మనీకి చెందిన పలు ఫుట్‌బాల్ టీమ్ లు ట్విటర్ లో పేర్కొన్నాయి.
జర్మనీకి షాకిచ్చిన జపాన్..
ఇదిలాఉండగా మ్యాచ్ విషయానికొస్తే ఫిఫాలో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ - ఈలో భాగంగా జపాన్.. 2-1 తేడాతో జర్మనీకి షాకిచ్చింది. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్ ఆట 33వ నిమిషంలో గోల్ కొట్టాడు. కానీ రెండో అర్థభాగంలో జపాన్ సబ్ స్టిట్యూట్ లుగా వచ్చిన రిత్సు (75వ నిమిషంలో), అసానో (83వ నిమిషంలో) లు గోల్ చేసి జపాన్ కు సంచలన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ కంటే ముందు సౌదీ కూడా అర్జెంటీనాకు షాకిచ్చిన విషయం తెలిసిందే. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు సౌదీ షాకిస్తే నాలుగు సార్లు విశ్వ విజేతగా నిలిచిన జర్మనీకి మరో ఆసియా జట్టు అయిన జపాన్ షాకివ్వడం గమనార్హం.