FIFA: అన్నంత పని చేసిన ఫిఫా.. సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్.. ఇద్దరు ఆటగాళ్లపై వేటు
FIFA World Cup 2022: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అన్నంత పని చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గుర్తు చేస్తూ అర్జెంటీనా ఆటగాళ్లపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది.
ప్రపంచకప్ సాధించాలనే లక్ష్యంలో ఉన్న అర్జెంటీనా దానికి రెండు అడుగుల దూరంలో ఉంది. క్వార్టర్స్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా.. ఈనెల 14న క్రొయేషియాతో తొలి సెమీస్ లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు అర్జెంటీనాకు ఫిఫా భారీ షాకిచ్చింది. క్వార్టర్స్ పోరులో భాగంగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించిన ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు వేసింది. అర్జెంటీనా స్టార్ ప్లేయర్లు గొంజాలో మోంటీల్, మార్కోస్ అకునా లు సెమీస్ లో క్రొయేషియాతో మ్యాచ్ లో ఆడటం లేదు.
నెదర్లాండ్స్ తో పోరులో మెస్సీతో పాటు ఇతర అర్జెంటీనా ఆటగాళ్లు వ్యవహరించిన తీరే ఈ వేటుకు కారణం. క్వార్టర్ ఫైనల్ లో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 18 సార్లు ఎల్లో కార్డ్ చూపాడు. ఇందులో అర్జెంటీనా ఆటగాళ్లకే 16 సార్లు మందలింపు చర్యలో భాగంగా ఎల్లో కార్డులు చూపెట్టాడు రిఫరీ.
క్రొయేషియాతో మ్యాచ్ లో వీళ్లిద్దరూ ఆడకపోవడంతో తుది జట్టులో ఎవరిని తీసుకుంటారా..? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు మోంటీల్, మార్కోస్ లతో పాటు మెస్సీమీదా వేటు తప్పదని భావించినా ఫిఫా అతడిని వదిలేయడం అర్జెంటీనాకు కాస్త ఊరట.
2014 వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన అర్జెంటీనా అప్పుడు కప్ కొట్టకుండానే నిష్క్రమించింది. అయితే మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ గా భావిస్తున్న తరుణంలో ఈసారి పట్టు విడవకూడదనే లక్ష్యంతో అర్జెంటీనా ఉంది. ఇక రష్యాలో జరిగిన 2018 ప్రపంచకప్ లో ఫైనల్ చేరి ఫ్రాన్స్ చేతిలో ఓడిన క్రొయేషియా ఈసారి మాత్రం కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు కలిసి రెండు సార్లు తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా - క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ జట్టు 1-0 తో క్రొయేషియాను ఓడించింది. ఇక 2018లో క్రొయేషియా.. 3-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మరి ఈనెల 14న జరుగబోయే సెమీస్ లో గెలిచి నిలిచేదెవరో..?