సెమీస్‌కు ముందు ఫ్రాన్స్‌కు భారీ షాక్.. మిస్టరీ వైరస్ తో మంచాన పడ్డ ముగ్గురు స్టార్ ప్లేయర్లు
FIFA World Cup 2022: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో నేటి రాత్రి ఫ్రాన్స్.. ఈ టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న మొరాకోతో పోటీ పడనున్నది. ఈ మ్యాచ్ కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్స్ కు ఊహించని షాక్ తాకింది.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఫ్రాన్స్.. నేటి (బుధవారం) రాత్రి ఈ టోర్నీలో సంచలన విజయాలతో అగ్రశ్రేణి జట్లకు షాకిస్తున్న మొరాకోతో తలపడనుంది. 2018 లో టోర్నీ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి కూడా ఆ ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నది. అందుకోసం మరో రెండు అడుగులు దాటితే చాలు. కానీ బుధవారం నాటి సెమీస్ కు ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తాకింది. ఫ్రాన్స్ కీలక ఆటగాళ్లు ముగ్గురు అంతు తెలియని వైరస్ తో మంచానపడ్డారు. వాళ్లు మొరాకోతో మ్యాచ్ లో ఆడేది అనుమానమే..
అల్ బయత్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరుగనున్న ఈ సెమీస్ మ్యాచ్ కు ముందు జట్టులోని డయోట్ ఉపమెకనొ, అడ్రీన్ రబియట్ లు మంగళవారం జరిగిన ట్రైనింగ్ సెషన్ కు హాజరుకాలేదు.
ఉపమెకనొ గొంతు నొప్పితో బాధపడుతుండగా రబియట్ కూడా అదే సమస్యతో మంచానపడ్డాడు. ఈ ఇద్దరికంటే ముందే ఆరెలిన్ చౌమెనీ ఇంగ్లాండ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. చౌమెనీ సైతం గొంతునొప్పితోనే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ ముగ్గురూ ఒకే రకమైన సమస్యతో బాధపడుతుంటం.. మెల్లగా జట్టులో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఫ్రాన్స్ టీమ్ తో పాటు ఆ జట్టు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నది.
ఇదిలాఉండగా సెమీస్ లో ఫ్రాన్స్ తలపడబోతున్న మొరాకో అంత తేలికైన ప్రత్యర్థైతే కాదు. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు అగ్రశ్రేణి జట్లకు షాకులిస్తూనే ఉంది. లీగ్ దశలో ఆ జట్టు.. తొలి మ్యాచ్ లో క్రొయేషియాతో డ్రా చేసుకున్నా తర్వాత రెండు మ్యాచ్ లలో బెల్జియం, కెనడాలను మట్టికరిపించింది. రౌండ్ ఆఫ్ 16లో మాజీ ఛాంపియన్ స్పెయిన్ కు చుక్కలు చూపించింది. ఇక క్వార్టర్స్ లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ కు షాకిచ్చి సెమీస్ చేరింది. సెమీస్ లో ఫ్రాన్స్ పై కూడా ఇలాంటి ఫలితమే రిపీట్ చేస్తే ఈ నెల 18న ఆ జట్టు అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది.